
భారత టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశంసలు కురిపించాడు. సారథిగా తన ఆగమనాన్ని ఘనంగా చాటాడని.. సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్‌ను ఏలే సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
ఇంగ్లండ్ పర్యటన రూపంలో తొలి ప్రయత్నంలోనే గట్టి సవాలును ఎదుర్కొన్నాడు. అయితే, సారథిగా అనుభవం లేకపోయినా ఇంగ్లండ్ గడ్డపై గిల్ మెరుగైన ఫలితాన్నే అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసుకున్నాడు.
డబుల్ సెంచరీతో..
అంతేకాదు.. బ్యాటర్‌గానూ మునుపెన్నడూ లేని విధంగా అద్భుత రీతిలో రాణించిన గిల్.. ఇంగ్లండ్ గడ్డ మీద రికార్డుల మోత మోగించాడు. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) సాధించి.. ఈ మైదానంలో టీమిండియాకు తొలి గెలుపు అందించాడు. మొత్తంగా.. 754 పరుగులు సాధించి సిరీస్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
సుదీర్ఘకాలం భారత క్రికెట్‌ను ఏలుతాడు
తద్వారా తనపై విమర్శలు చేసిన వాళ్ల నోళ్లు మూతపడేలా చేశాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ.. ఇంగ్లండ్‌లో ఇలాంటి సిరీస్ ఆడిన తర్వాత.. అతడి స్థానం తప్పక సుస్థిరమవుతుంది. సుదీర్ఘకాలం పాటు భారత క్రికెట్‌లో భాగంగా ఉంటాడు.
అతడికి ఇప్పుడు 25 ఏళ్లే. ఇంకా మెరుగుపడతాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడి టెంపర్‌మెంట్ బాగుంది. నిజమైన నాయకుడిలా.. యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేసే రాజులా పరిణతి చూపిస్తూనే.. దూకుడు ప్రదర్శించాడు. పట్టుదలగా నిలబడి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు’’ అంటూ రవిశాస్త్రి స్కై స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు.
గొప్పగా నడిపించాడు: యువీ
మరోవైపు.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా భారత జట్టును నడిపించిన తీరుపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.
ఈ సిరీస్‌కు ముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ ఒకేసారి జవాబిస్తున్నట్లుగా అతని సారథ్యం కనిపించిందని యువీ అన్నాడు. గిల్ కెప్టెన్సీ నమ్మశక్యంగా అనిపించలేదని కితాబిచ్చాడు. కెరీర్ ఆరంభంలో స్వయంగా యువీనే మెంటార్‌గా గిల్‌కు మార్గనిర్దేశనం చేశాడు.
‘విదేశాల్లో గిల్ రికార్డును చాలా మంది ప్రశ్నించారు కానీ అతను కెప్టెన్ కావడంతోనే నాలుగు సెంచరీలు బాదాడు. బాధ్యతను అప్పగిస్తే దానిని మరింత సమర్థంగా నిర్వర్తించిన తీరు నమ్మశక్యం కాని రీతిలో ఉంది.
భారత జట్టును చూస్తే గర్వంగా అనిపించింది. పేరుకు సిరీస్ ‘డ్రా’ అయినా నా దృష్టిలో ఇది మనం గెలిచినట్లే. పెద్దగా అనుభవం లేని జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లి ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటడం అంత సులువు కాదు’ అని యువరాజ్ అభిప్రాయ పడ్డాడు. కోహ్లి, రోహిత్‌లు లేకపోవడాన్ని ఒక సవాల్‌గా తీసుకొని మన కుర్రాళ్లు సత్తా చాటారని యువీ అన్నాడు.
‘సాధారణంగా యువ ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు వెళ్లినప్పుడు వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కోహ్లి, రోహిత్‌లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. కానీ కుర్రాళ్లు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు.
నా దృష్టిలో జడేజా, సుందర్ సెంచరీలతో మాంచెస్టర్ టెస్టును ‘డ్రా’ చేసుకోవడం కీలక మలుపు. ఇలాంటిది చాలా కాలంగా నేను చూడలేదు. ఇది మన జట్టు స్థాయి ఏంటో చూపించింది. జడేజాకు అంటే చాలా అనుభవం ఉంది. కానీ యువ ఆటగాడు సుందర్ ప్రదర్శనను మాత్రం ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది’ అని యువరాజ్ విశ్లేషించాడు.
చదవండి: ‘యాడ్స్ చేయడానికే పనికివస్తారు.. కోచ్‌ల మాట అస్సలు వినరు’