
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం (Babar Azam), మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan)లపై విమర్శల వర్షం కురుస్తోంది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి చెత్త ఆట తీరే ఇందుకు కారణం. స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్న బాబర్, రిజ్వాన్ జట్టు పరాజయాలకు పరోక్ష కారణం అవుతున్నారు.
వన్డే వరల్డ్‌కప్ 2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో బాబర్, రిజ్వాన్ వైఫల్యాల కారణంగా పాక్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. 2023, 2024 ప్రపంచకప్ టోర్నీల తర్వాత బాబర్ ఆజం కెప్టెన్ పదవికి రాజీనామా చేయగా.. రిజ్వాన్ సారథిగా ఎంపికయ్యాడు.
టీ20ల నుంచి ఉద్వాసన
అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే టీ20 జట్టు నుంచి బాబర్‌తో పాటు రిజ్వాన్‌ను తప్పించిన పాక్ క్రికెట్ బోర్డు యాజమాన్యం.. సల్మాన్ ఆఘాకు పగ్గాలు అప్పగించింది. ఇక వన్డేల్లోనూ బాబర్- రిజ్వాన్ జోడీ ఫెయిల్ అవుతోంది. తాజాగా వెస్టిండీస్‌తో మూడో వన్డేల్లో వీరిద్దరు చెత్త ప్రదర్శన కనబరిచారు.
ఆతిథ్య విండీస్ విధించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ ఆజం 23 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులే చేయగా.. కెప్టెన్ రిజ్వాన్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. వీరితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా విఫలం కావడంతో 92 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్.. ఏకంగా 202 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. 34 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను 1-2తో వెస్టిండీస్‌కు కోల్పోయింది.
యాడ్స్ చేయడానికే పనికివస్తారు
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ బసిత్ అలీ (Basit Ali) బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌ల ఆట తీరుపై మండిపడ్డాడు. ‘‘కెరీర్ ఆరంభంలో ఎంతో గొప్పగా ఆడిన వీరిద్దరు.. ఇప్పుడు స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు.
వాళ్లు కేవలం యాడ్స్ చేయడానికే పనికివస్తారు. వాళ్లను అలా వదిలేస్తేనే మంచిదేమో!.. కోచ్‌ల మాట వినరు. బ్యాటింగ్ కోచ్‌లు ఏదైనా చెప్తే.. విన్నట్లు నటిస్తారంతే. పోనీ.. ఇంజమామ్ ఉల్ హక్, యూసఫ్, యూనిస్ ఖాన్ లాంటి వాళ్లు సలహాలు ఇస్తేనైనా బాగుపడతారనుకుంటే.. అందుకు బాబర్, రిజ్వాన్ అందుకు అస్సలు సమ్మతించరు. ఎవరు ఏం చెప్పినా వారు చెవినపెట్టరు’’ అంటూ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చదవండి: ధోని జట్టు నుంచి నన్ను తప్పించాడు.. అప్పుడే రిటైర్ అయ్యేవాడిని.. కానీ..: సెహ్వాగ్