
ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ఒకడు. తన విధ్వంసకర ఆట తీరుతో ఈ కుడిచేతి వాటం ఆటగాడు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందదించాడు. సమకాలీన ఓపెనర్లు కొత్త బంతిని ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్న సమయంలో తాను మాత్రం మొదటి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టి.. బౌలర్లకు చుక్కలు చూపించేవాడు.
సూపర్ ‘హిట్’
తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడిన సెహ్వాగ్ 82కు పైగా స్ట్రైక్‌రేటుతో 8586 పరుగులు సాధించాడు. ఇందులో 23 శతకాలు, 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. అన్నింటికంటే ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై వీరూ భాయ్ సాధించిన ట్రిపుల్ సెంచరీ (319) టీమిండియా అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఇక 251 వన్డేల్లో వీరేందర్ సెహ్వాగ్ 104కు పైగా స్ట్రైక్‌రేటుతో.. 15 శతకాలు, ఒక డబుల్ సెంచరీ సాయంతో 8273 పరుగులు సాధించాడు. అంతేకాదు.. టీమిండియా సొంతగడ్డపై ధోని సారథ్యంలో 2011 నాటి వన్డే వరల్డ్‌కప్ గెలవడంలోనూ వీరూది కీలక పాత్ర.
అపుడే రిటైర్ అయ్యేవాడిని
అయితే, ఈ చారిత్రాత్మక విజయానికి మూడేళ్ల ముందే అంటే 2008లోనే సెహ్వాగ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిద్దామని అనుకున్నాడట. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఆస్ట్రేలియాతో 2007-08 నాటి సిరీస్‌లో తుదిజట్టు నుంచి తనని తప్పించడమే ఇందుకు కారణం. అయితే, సచిన్ టెండుల్కర్ హితబోధ చేయడంతో వీరూ భాయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
ధోని నన్ను తుదిజట్టు నుంచి తప్పించాడు
ఈ విషయాన్ని వీరేందర్ సెహ్వాగ్ స్వయంగా వెల్లడించాడు. పద్మజీత్ సెహ్రావత్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘2007-08లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఎంఎస్ ధోని నన్ను తుదిజట్టు నుంచి తప్పించాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి తీసుకోనేలేదు.

ఇకపై ప్లేయింగ్ ఎలెవన్‌లో నాకు చోటు ఉండబోదని నాకు అర్థమైంది. అలాంటపుడు వన్డేల్లో కొనసాగడంలోనూ అర్థం లేదనిపించింది. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ దగ్గరికి వెళ్లి.. ‘వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిద్దామని అనుకుంటున్నా’ అని చెప్పాను.
సచిన్ నాతో చెప్పింది ఇదే
అందుకు బదులుగా.. ‘నీలాగే నేను కూడా 1999-2000 సంవత్సరంలో ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొన్నా. పరుగులు రాబట్టేందుకు ఇబ్బందిపడ్డా. ఆటకు వీడ్కోలు పలకాలని అనుకున్నా. కానీ ఆ కఠిన దశను అధిగమించాను.
ఇప్పుడు నువ్వు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావు. ఇది కూడా త్వరలోనే ముగిసిపోతుంది. భావోద్వేగానికి లోనై ఎలాంటి తొందరపాటు నిర్ణయాలూ తీసుకోవద్దు. 1-2 సిరీస్‌లు చూడు. ఆ తర్వాత అప్పటికి రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటే అలాగే చేద్దువు’ అని సచిన్ నాతో చెప్పాడు.
వన్డే వరల్డ్‌కప్ కూడా గెలిచాను
ఆ సిరీస్ ముగిసిన తర్వాత నేను తదుపరి సిరీస్‌లో పరుగుల వరద పారించాను. అంతేకాదు 2011లో వన్డే వరల్డ్‌కప్ కూడా గెలిచాను’’ అంటూ సెహ్వాగ్ తన కెరీర్‌లోని చేదు అనుభవాల నుంచి తేరుకుని... మధురానుభూతులను సొంతం చేసుకున్న జ్ఞాపకాల గురించి పంచుకున్నాడు.
కాగా ఆస్ట్రేలియాతో 2007-08 నాటి సిరీస్‌లో వీరూ భాయ్ ఐదు మ్యాచ్‌లు ఆడి 16.20 సగటుతో కేవలం 81 పరుగులే చేశాడు. ఇక 2015లో ఢిల్లీ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో మొత్తంగా 19 అంతర్జాతీయ టీ20లు ఆడిన సెహ్వాగ్.. 394 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో 104 మ్యాచ్‌లలో కలిపి రెండు సెంచరీల సాయంతో 2728 పరుగులు సాధించాడు.
చదవండి: సంజూ రాయల్స్ నుంచి వైదొలగాలనుకోవడానికి అతడే ప్రధాన కారణం..?