
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అవార్డు లభించింది. జూలై నెలకు గానూ అతడు ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Player Of The Month)’ అవార్డు గెలుచుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్‌లో అదరగొట్టడం ద్వారా గిల్‌కు ఈ గౌరవం దక్కింది.
భారీ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో శతక్కొట్టి (147)న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. బర్మింగ్‌హామ్‌లో ఏకంగా భారీ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) సాధించి ఈ వేదికపై భారత్‌కు తొలి గెలుపు అందించాడు.
అంతేకాకుండా.. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో మరోసారి శతకం (103) బాది ఈ మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకోవడంలో గిల్ తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో బ్యాటర్‌గా విఫలమైనా.. కెప్టెన్‌గా విజయం సాధించి.. సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగాడు.
754 పరుగులు
ఇక ఇంగ్లండ్‌తో ఓవరాల్‌గా ఐదు టెస్టుల సిరీస్‌లో శుబ్‌మన్ గిల్.. పది ఇన్నింగ్స్‌లో కలిపి 754 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో జూలై నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు అతడు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న గిల్.. ఎట్టకేలకు వీరిద్దరిని అధిగమించి అవార్డును సొంతం చేసుకున్నాడు.
నాలుగోసారి.. అత్యంత మధురమైన క్షణం అదే
కాగా 25 ఏళ్ల గిల్ ఈ పురస్కారం అందుకోవడం ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో గిల్ స్పందిస్తూ.. ‘‘జూలై నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడం గొప్పగా అనిపిస్తోంది. ఈసారి టీమిండియా టెస్టు కెప్టెన్ హోదాలో.. నా ప్రదర్శనకు గానూ ఈ పురస్కారం అందుకోవడం ఇంకా సంతోషంగా ఉంది.
బర్మింగ్‌హామ్‌లో డబుల్ సెంచరీ సాధించడం ఇంగ్లండ్ పర్యటన మొత్తంలో నాకు అత్యంత మధురమైన క్షణం. ఇంగ్లండ్ గడ్డ మీద కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించడం గొప్ప అనుభవం. ఇరుజట్లు అద్భుత పోరాట పటిమ కనబరిచాయి.
నాకు ఈ అవార్డు దక్కేలా చేసిన జ్యూరీ మెంబర్లకు ధన్యవాదాలు. అదే విధంగా.. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన నా సహచర ఆటగాళ్లకు శుభాకాంక్షలు. దేశం కోసం మరింత గొప్పగా ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను’’ అని గిల్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ఆన్‌లైన్ ద్వారా వచ్చే అభిమానుల ఓట్ల ఆధారంగా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతను నిర్ణయిస్తారు.
చదవండి: AUS vs SA: బేబీ ఏబీడీ విధ్వంసకర శతకం.. తొలి ‘ఫాస్టెస్ట్ సెంచరీ’తో..