
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) పరుగుల సునామీ సృష్టించాడు. ఆసీస్‌తో రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
41 బంతుల్లోనే...
ఇదే జోరులో మరో పదహారు బంతుల్లోనే శతక మార్కును అందుకున్న డెవాల్డ్ బ్రెవిస్.. సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ (T20I Fastest Century) నమోదు చేశాడు. అంతకు ముందు డేవిడ్ మిల్లర్ (David Miller) బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో శతక్కొట్టగా.. తాజాగా బ్రెవిస్ ఆసీస్‌పై 41 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఆసీస్‌పై ఇదే తొలి ఫాస్టెస్ట్ సెంచరీ
ఇక ఆస్ట్రేలియాపై టీ20లలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం మరో విశేషం. కాగా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్ వేదికగా ఆదివారం తొలి టీ20 జరుగగా.. ఆసీస్ 17 పరుగుల తేడాతో గెలిచి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఈ క్రమంలో ఆసీస్- ప్రొటిస్ జట్ల మధ్య మంగళవారం డార్విన్ వేదికగా రెండో టీ20కి షెడ్యూల్ ఖరారు కాగా.. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం మాత్రం లభించలేదు.
టాపార్డర్ విఫలం
ఆసీస్ స్టార్లు గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్ దెబ్బకు ప్రొటిస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లలో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (18)ను మాక్సీ స్వల్ప స్కోరుకు వెనక్కి పంపగా.. రియాన్ రికెల్టన్ (14)ను డ్వార్షుయిస్ పెవిలియన్ బాట పట్టించాడు.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన యువ ఆటగాడు లువాన్-డ్రి ప్రిటోరియస్ పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. మాక్సీ బౌలింఘ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఇలా 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ సంచలన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.
బేబీ ఏబీడీ సునామీ ఇన్నింగ్స్
కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించిన బ్రెవిస్.. ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 31)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు బాదిన 22 ఏళ్ల బ్రెవిస్.. 125 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 218 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.
ఆసీస్ బౌలర్లలో గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్ రెండేసి వికెట్లు కూల్చగా.. జోష్ హాజిల్‌వుడ్, ఆడం జంపా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సీన్ అబాట్, అలెక్స్ క్యారీ కగిసో రబాడ (5) రనౌట్‌లో భాగమయ్యారు.
చదవండి: WC 2011: ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి... వారిద్దరి సలహాల వల్లే..: యువీ
The second-quickest T20I hundred from a South African player!
Dewald Brevis, take a bow 👏#AUSvSA pic.twitter.com/JOpk3tptGT— cricket.com.au (@cricketcomau) August 12, 2025