రికెల్టన్‌ సుడిగాలి శతకం వృథా | SA20: Rickelton Maiden ton in vain as Super Kings Edge MI Cape Town | Sakshi
Sakshi News home page

రికెల్టన్‌ సుడిగాలి శతకం వృథా.. మార్క్రమ్‌ మెరుపులతో బోణీ

Dec 27 2025 3:37 PM | Updated on Dec 27 2025 3:53 PM

SA20: Rickelton Maiden ton in vain as Super Kings Edge MI Cape Town

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26 సీజన్‌కు తెరలేచింది. కేప్‌టౌన్‌ వేదికగా డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌- ఎంఐ కేప్‌టౌన్‌ మధ్య శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన సూపర్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో డెవాన్‌ కాన్వే మెరుపు అర్ధ శతకం (33 బంతుల్లో 64) సాధించగా.. కేన్‌ విలియమ్సన్‌ ధనాధన్‌ (25 బంతుల్లో 40) దంచికొట్టాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన జోస్‌ బట్లర్‌ (12 బంతుల్లో 22), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (14 బంతుల్లో 22) ఆకట్టుకోగా.. కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (17 బంతుల్లో 35), ఇవాన్‌ జోన్స్‌ (14 బంతుల్లో 33 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. ఆఖర్లో డేవిడ్‌ వీస్‌ (5 బంతుల్లో 9) మెరపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.

కేప్‌టౌన్‌ బౌలర్లలో జార్జ్‌ లిండే రెండు వికెట్లు తీయగా.. కార్బిన్‌ బాష్‌, ట్రిస్టన్‌ లూస్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో కేప్‌టౌన్‌ ఆదిలోనే ఓపెనర్‌ రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌ (2) వికెట్‌ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు.

 

 కేవలం 63 బంతుల్లోనే ఐదు ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లు బాదిన రికెల్టన్‌ 113 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రీజా హెండ్రిక్స్‌ (28) ఫర్వాలేదనిపించగా.. జేసన్‌ స్మిత్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (14 బంతుల్లో 41)తో మెరిశాడు.

 

అయితే, మిగిలిన వారి నుంచి అతడికి సహకారం లభించలేదు. నికోలస్‌ పూరన్‌ (15) నిరాశపరచగా.. డ్వేన్‌ ప్రిటోరియస్‌ (5) తేలిపోయాడు. జార్జ్‌ లిండే డకౌట్‌ కాగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ 1, కార్బిన్‌ బాష్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఏడు వికెట్లు నష్టపోయిన కేప్‌టౌన్‌ 217 పరుగులకు పరిమితమై.. 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

డేవిడ్‌ వీస్‌, సైమన్‌ హార్మర్‌, క్వెనా మఫాకా తలా ఒక వికెట్‌ పడగొట్టగా.. ఎథాన్‌ బాష్‌ నాలుగు వికెట్లతో చెలరేగి కేప్‌టౌన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తొలి శతకం బాదిన రికెల్టన్‌ ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement