
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ (IND vs PAK) జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) విమర్శలు గుప్పించాడు. ప్రత్యర్థి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నపుడు కనీసం 200 పరుగులైనా స్కోరు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
ఆసియా కప్-2025 టోర్నీలో తొలుత లీగ్ దశలో భారత్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన పాక్.. తాజాగా సూపర్-4 మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సల్మాన్ ఆఘా బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ఫర్హాన్ ఓవరాక్షన్
పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, చేసింది హాఫ్ సెంచరీయే అయినా.. ఏకే-47 మాదిరి గన్ ఎక్కుపెట్టి కాలుస్తున్నట్లు ఫర్హాన్ ఓవరాక్షన్ చేశాడు. అయితే, లక్ష్య ఛేదనలో టీమిండియా ఇందుకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చింది.
ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74)- శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరికి తోడు తిలక్ వర్మ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. పాక్‌ను మరోసారి కంగుతినిపించింది.
ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్‌మన్ గిల్‌లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు ఆది నుంచే అద్భుత రీతిలో బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. ఈ క్రమంలో ఫర్హాన్ సెలబ్రేషన్ చేసుకున్న తీరును కూడా కనేరియా విమర్శించాడు.
నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు
‘‘సాహిబ్‌జాదా ఫర్హాన్ ఏకే-47 గన్ కాలుస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత శుబ్‌మన్ గిల్- అభిషేక్ శర్మ తమ బ్యాట్లతోనే ఏకంగా బ్రహ్మోస్ ప్రయోగించారు.
ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ముద్దులు విసురుతూనే బౌండరీల వర్షం కురిపించాడు. పాక్ బౌలింగ్‌పై వారిద్దరు విరుచుకుపడ్డారు. ఇందుకు పాక్ ఆటగాళ్ల వద్ద సమాధనమే లేకుండా పోయింది.
మీరు ఉతుకుడు అని సంబరపడ్డారు. వారు ఉతికి.. ఉతికి ఆరేశారు. ప్రత్యర్థి జట్టులో అభిషేక్ శర్మ- శుబ్‌మన్ గిల్ వంటి ఓపెనర్లు ఉన్నపుడు 200 పరుగుల స్కోరు కూడా చిన్నదే అయిపోతుంది. వాళ్లిద్దరు క్లాస్ ప్లేయర్లు’’ అంటూ డానిష్ కనేరియా వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు.