అంచనాల్లేకుండా బరిలోకి జర్మనీ
గత రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశలోనే నిష్క్రమణ
ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత నిలకడగా రాణిస్తున జట్లలో జర్మనీ జట్టు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ జరగ్గా... అత్యధికసార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా జర్మనీకి పేరుంది. నాలుగుసార్లు (1954, 1974, 1990, 2014) విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ జట్టు... మరో నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా (1966, 1982, 1986, 2002) నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానం (1934, 1970, 2006, 2010) సంపాదించింది. 2014లో బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన జర్మనీ... ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడిపోయింది.
పలువురు స్టార్ ఆటగాళ్లు రిటైర్ కావడం... వారి స్థానాలను భర్తీ చేసేవాళ్లు ఇంకా తయారు కాకపోవడం... వెరసి జర్మనీ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్‌లలో (2018, 2022) గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ‘యూరో’ టోర్నీలో జర్మనీ క్వార్టర్ ఫైనల్లో చాంపియన్ స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక ప్రపంచకప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘ఎ’లో ఉన్న జర్మనీ 15 పాయింట్లతో టాపర్‌గా నిలిచి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది.
పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతున్న జర్మనీ ఈసారి గ్రూప్ దశ సులువుగానే దాటే అవకాశం ఉంది. గ్రూప్ ‘ఇ’లో కురసావ్, ఐవరీకోస్ట్, ఈక్వెడార్ జట్లతో జర్మనీకి చోటు కల్పించారు. జర్మనీ తొలి మ్యాచ్‌ను జూన్ 14న కురసావ్‌తో, రెండో మ్యాచ్‌ను జూన్ 20న ఐవరీకోస్ట్‌తో, జూన్ 25న ఈక్వెడార్‌తో ఆడుతుంది. మిడ్‌ఫీల్డర్లు జమాల్ ముసియాలా, ఫ్లోరియన్ విట్జ్, లెనార్ట్ కార్ల్, కాయ్ హావెట్జ్‌లతోపాటు వెటరన్ గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయెర్ ప్రదర్శనపై జర్మనీ ముందంజ వేసే ఆశలు ఆధారపడి ఉన్నాయి. జర్మనీ జట్టుకు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ ఎదురయ్యే అవకాశముంది. ఫ్రాన్స్ అడ్డంకిని అధిగమిస్తే జర్మనీ నుంచి అద్భుత ఫలితం ఆశించవచ్చు. – సాక్షి క్రీడావిభాగం


