జర్మనీపై 2–1తో సంచలన విజయం
20 ఏళ్ల తర్వాత నాకౌట్ దశకు అర్హత
న్యూయార్క్: ఈక్వెడార్ ఫుట్‌బాల్ జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచింది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా... నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన జర్మనీ జట్టుపై ఊహించని విజయాన్ని సాధించింది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా జరిగిన చివరిదైన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఈక్వెడార్ 2–1తో జర్మనీ జట్టును బోల్తా కొట్టించింది.
ఐవరీకోస్ట్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓటమి చెందడం... రెండో మ్యాచ్‌లో కురసావ్ లాంటి అనామక జట్టుతో ‘డ్రా’ చేసుకోవడం... వెరసి జర్మనీతో మ్యాచ్‌కు ముందు ఒక్క పాయింట్‌తో ఈక్వెడార్ టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితిలో నిలిచింది. కానీ ఈక్వెడార్ జట్టు సమష్టి ఆటతీరుతో సత్తా చాటుకొని గెలుపు ఈల వేసింది.
గ్రూప్ ‘ఇ’లో నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 12 గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో నిలిచిన 8 అత్యుత్తమ జట్లకు కూడా నాకౌట్ బెర్త్‌లు లభిస్తాయి. మూడో స్థానంలో నిలిచే 8 అత్యుత్తమ జట్లలో ఈక్వెడార్ ఉండటం ఖాయం కావడంతో ఆ జట్టుకు నాకౌట్ బెర్త్ లభించింది.
0–1తో వెనుకబడి...
మ్యాచ్ మొదలైన 2వ నిమిషంలోనే లెరాయ్ సెన్ గోల్‌తో జర్మనీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరంభంలోనే వెనుకబడ్డా... ఆందోళన చెందకుండా ఈక్వెడార్ ఆటగాళ్లు అవకాశం ఉన్నపుడల్లా జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించారు. ఫలితంగా 9వ నిమిషంలోనే నిల్సన్ అంగులో గోల్‌తో ఈక్వెడార్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత జర్మనీ వ్యూహాలు మార్చి ఈక్వెడార్ జోరుకు బ్రేక్ వేసింది.
ఒకదశలో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనిపించినా... 77వ నిమిషంలో ‘డి’ ఏరియాలో గోల్‌పోస్ట్ ముందు లభించిన అవకాశాన్ని ఈక్వెడార్ ప్లేయర్ గొంజాలో ప్లాటా వదులుకోలేదు. కెవిన్ రోడ్రిగెజ్ హెడర్ షాట్‌ను గోల్‌పోస్ట్ ముందున్న ప్లాటా లక్ష్యానికి చేర్చడంతో ఈక్వెడార్ 2–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేవరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని ఈక్వెడార్ ఈ టోర్నీలో తొలి విజయం అందుకోవడంతోపాటు నాకౌట్ బెర్త్‌ను దక్కించుకుంది.
ఐవరీకోస్ట్ తొలిసారి...
నాలుగో ప్రయత్నంలో ఐవరీకోస్ట్ జట్టు ప్రపంచకప్‌లో తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా కురసావ్ జట్టుతో ఫిలడెల్ఫియాలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఐవరీకోస్ట్ 2–0తో గెలిచింది. నికోలస్ పెపె (7వ, 64వ నిమిషంలో) రెండు గోల్స్ చేసి ఐవరీకోస్ట్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గ్రూప్ ‘ఇ’లో జర్మనీ, ఐవరీకోస్ట్ ఆరు పాయింట్లతో సమంగా నిలిచినా... గోల్స్ అంతరం కారణంగా జర్మనీ గ్రూప్ విజేతగా నిలువగా.. ఐవరీకోస్ట్ రెండో స్థానంతో ముందంజ వేసింది. 2006, 2010, 2014 ప్రపంచకప్‌లలో ఐవరీకోస్ట్ లీగ్ దశలోనే నిష్క్రమించింది.
12వసారి నెదర్లాండ్స్ ముందుకు...
కాన్సస్ సిటీలో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ ఆఖరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–1తో గెలిచింది. ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన నెదర్లాండ్స్ ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్న 12వసారీ నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్ ‘ఎఫ్’లోని మరో మ్యాచ్‌లో జపాన్ 1–1తో స్వీడన్‌ను నిలువరించింది. ఐదు పాయింట్లతో జపాన్ గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ బెర్త్‌ను దక్కించుకుంది. టోర్నీ నుంచి నిష్క్రమించిన టర్కీ గ్రూప్ ‘డి’ చివరి మ్యాచ్‌లో 3–2తో అమెరికాపై నెగ్గింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో పరాగ్వేతో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌ను ఆ్రస్టేలియా 0–0తో ‘డ్రా’గా ముగించి నాకౌట్ దశకు చేరింది.


