ఎంబాపె ‘డబుల్‌’ ధమాకా | France also kicked off their Football World Cup campaign with a victory | Sakshi
Sakshi News home page

ఎంబాపె ‘డబుల్‌’ ధమాకా

Jun 18 2026 2:52 AM | Updated on Jun 18 2026 2:52 AM

France also kicked off their Football World Cup campaign with a victory

ఫ్రాన్స్‌ 3–1 సెనెగల్‌

గత వరల్డ్‌కప్‌ రన్నరప్‌ ఫ్రాన్స్‌ కూడా విజయంతో గెలుపు బోణీ కొట్టింది. గ్రూప్‌ ‘ఐ’లో భాగంగా భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 3–1 గోల్స్‌ తేడాతో సెనెగల్‌ జట్టును ఓడించింది. కెప్టెన్‌ కిలియన్‌ ఎంబాపె (66వ, 90+6వ నిమిషంలో) రెండు గోల్స్‌తో విజృంభించగా... బ్రాడ్లీ బార్కోలా (82వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించాడు. సెనెగల్‌ తరఫున ఇబ్రహీం ఎంబాయె (90+5వ నిమిషంలో) ఏకైక గోల్‌ నమోదు చేశాడు. 

2002 ప్రపంచకప్‌లో సెనెగల్‌తో ఆడిన ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయిన ఫ్రాన్స్‌కు ఈసారి కూడా గట్టిపోటీనే ఎదురైంది. ముఖ్యంగా స్టార్‌ ప్లేయర్‌ ఎంబాపెను సెనెగల్‌ డిఫెండర్లు కట్టడి చేశారు. దాంతో తొలి అర్ధభాగంలో ఎంబాపె కేవలం 14 సార్లు మాత్రమే బంతిని టచ్‌ చేశాడు. అయితే రెండో అర్ధభాగంలో ఎంబాపెను నిలువరించడంలో సెనెగల్‌ ప్లేయర్లు విఫలమయ్యారు. 

66వ నిమిషంలో మైకేల్‌ ఒలిసె అందించిన పాస్‌ను ఎంబాపె గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఖాతా తెరిచిన తర్వాత ఫ్రాన్స్‌ మరింత జోరును పెంచింది. బార్కోలా గోల్‌తో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్‌ ఇంజ్యూరీ టైమ్‌లో గోల్‌ సమర్పించుకుంది. అయితే ఆ వెంటనే ఎంబాపె 30 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరే కిక్‌తో ఫ్రాన్స్‌ ఖాతాలో మూడో గోల్‌ చేరింది.

పోర్చుగల్‌ను నిలువరించిన కాంగో
హ్యూస్టన్‌: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. భారీ విజయంతో బోణీ కొడుతుందనుకున్న క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ జట్టు తొలి మ్యాచ్‌ను ‘డ్రా’తో సరిపెట్టుకుంది. 52 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించిన డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో జట్టు అసాధారణ ఆటతీరును కనబరిచింది. రొనాల్డో కెప్టెన్సీలోని పోర్చుగల్‌తో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఆరో నిమిషంలో నెవాస్‌ గోల్‌తో పోర్చుగల్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

45+5వ నిమిషంలో యోన్‌ విస్సా గోల్‌తో కాంగో జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. ప్రపంచకప్‌ చరిత్రలో కాంగో జట్టుకు తొలి గోల్‌ అందించిన ప్లేయర్‌గా విస్సా నిలిచాడు. 1974 ప్రపంచకప్‌లో కాంగో జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక్క గోల్‌ కూడా చేయకుండానే ఓడిపోయింది. మరోవైపు ఈ మ్యాచ్‌ ద్వారా వరుసగా ఆరో ప్రపంచకప్‌ ఆడిన రెండో ప్లేయర్‌గా పోర్చుగల్‌ దిగ్గజం, 41 ఏళ్ల రొనాల్డో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో మెస్సీ సరసన రొనాల్డో నిలిచాడు.  

58 అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఫ్రాన్స్‌ ప్లేయర్‌గా ఎంబాపె గుర్తింపు పొందాడు. 57 గోల్స్‌తో ఒలివర్‌ గిరూడ్‌ పేరిట ఉన్న రికార్డును ఎంబాపె బద్దలు కొట్టాడు.

14 ప్రపంచకప్‌ చరిత్రలో ఎంబాపె చేసిన గోల్స్‌. ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఫ్రాన్స్‌ ప్లేయర్‌గా ఎంబాపె అవతరించాడు. 13 గోల్స్‌తో జస్ట్‌ ఫోంటెన్‌ పేరిట ఉన్న రికార్డును ఎంబాపె సవరించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్ల జాబితాలో ఎంబాపె మూడో స్థానానికి ఎగబాకాడు.

ఆ్రస్టియా... 1990 తర్వాత
శాన్‌ఫ్రాన్సిస్కో: తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆసియా జట్టు జోర్డాన్‌కు నిరాశ ఎదురైంది. గ్రూప్‌ ‘జె’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టియా 3–1తో జోర్డాన్‌ను ఓడించింది. ఆ్రస్టియా తరఫున రొమానో (20వ నిమిషంలో), మార్కో అర్నాటోవిక్‌ (90+12వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. జోర్డాన్‌ ప్లేయర్‌ యాజాన్‌ అలారబ్‌ (76వ నిమిషంలో) సెల్ఫ్‌ గోల్‌ సాధించాడు. 

జోర్డాన్‌ తరఫున అలీ ఒల్వాన్‌ (50వ నిమిషంలో) రెగ్యులర్‌ గోల్‌ చేశాడు. చివరిసారి 1998లో ప్రపంచకప్‌లో ఆడిన ఆ్రస్టియా 1990 తర్వాత ప్రపంచకప్‌లో గెలుపు రుచి చూసింది. 1998లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ్రస్టియా 1990లో 2–1తో అమెరికాపై నెగ్గింది. 1994 ప్రపంచకప్‌ టోర్నీకి ఆ్రస్టియా అర్హత సాధించలేదు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement