భళా బ్రెజిల్‌... | Former champions Brazil won their 12th consecutive group title | Sakshi
Sakshi News home page

భళా బ్రెజిల్‌...

Jun 26 2026 3:15 AM | Updated on Jun 26 2026 3:15 AM

Former champions Brazil won their 12th consecutive group title

వరుసగా 12వసారి గ్రూప్‌ విజేతగా నిలిచిన మాజీ చాంపియన్‌

స్కాట్లాండ్‌పై 3–0తో గెలిచి నాకౌట్‌ దశకు అర్హత

రెండు గోల్స్‌తో మెరిసిన వినిసియస్‌ 

మయామి: ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించి రెండు పుష్కరాలు దాటినా... అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో నిలకడగా రాణించే జట్లలో ఒకటైన బ్రెజిల్‌ మరోసారి సత్తా చాటుకుంది. 23వ ప్రపంచకప్‌ టోర్నీలో బ్రెజిల్‌ జట్టు దర్జాగా నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. స్కాట్లాండ్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘సి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 3–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. వినిసియస్‌ జూనియర్‌ (7వ, 45+3వ నిమిషంలో) రెండు గోల్స్‌తో మెరిపించగా... మథియాస్‌ కునా (60వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. 

తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్టార్‌ ప్లేయర్‌ నెమార్‌ ఈ మ్యాచ్‌లో 76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగినా గోల్‌ చేయలేకపోయాడు. రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో బ్రెజిల్‌ ఏడు పాయింట్లతో గ్రూప్‌ ‘సి’లో టాపర్‌గా నిలిచింది. ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన బ్రెజిల్‌ జట్టు ప్రపంచకప్‌ టోర్నీలో లీగ్‌ దశలో తమ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని సంపాదించడం వరుసగా ఇది 12వసారి (1982 నుంచి 2026 వరకు) కావడం విశేషం. మొరాకోతో జరిగిన తొలి మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న బ్రెజిల్‌... రెండో మ్యాచ్‌లో 3–0తో హైతీపై గెలిచింది. 

లీగ్‌ దశలో బ్రెజిల్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వినిసియస్‌ గోల్స్‌ చేయడం విశేషం. తద్వారా ప్రపంచకప్‌లోని గ్రూప్‌ దశ మూడు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ గోల్స్‌ కొట్టిన ఐదో బ్రెజిలియన్‌గా వినిసియస్‌ గుర్తింపు పొందాడు. గతంలో బ్రెజిల్‌ తరఫున జైర్‌జినో (1970లో), రొమారియో (1994లో), రొనాల్డో నజారియో (2002లో), రివాల్డో (2002లో) ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ఈ మూడుసార్లూ బ్రెజిల్‌ జట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గడం విశేషం.  

మొరాకో మెరుపులు 
అట్లాంటా: గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకో ఈసారి అదరగొడుతోంది. హైతీ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘సి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో మొరాకో 4–2తో గెలిచింది. మొరాకో తరఫున అచ్రఫ్‌ హకీమి (39వ నిమిషంలో), ఇస్మాయిల్‌ సైబారి (45+1వ నిమిషంలో), సూఫియాన్‌ రహీమి (78వ నిమిషంలో), గెసిమి యాసిన్‌ (89వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

మొరాకో ప్లేయర్‌ యాసిన్‌ బునూ (10వ నిమిషంలో) ‘సెల్ఫ్‌ గోల్‌’తో ఖాతా తెరిచిన హైతీ జట్టుకు విల్సిన్‌ ఇసిడోర్‌ (43వ నిమిషంలో) మరో గోల్‌ అందించాడు. ఏడు పాయింట్లతో బ్రెజిల్, మొరాకో గ్రూప్‌ ‘సి’లో సమంగా నిలిచినా... గోల్స్‌ అంతరం కారణంగా బ్రెజిల్‌కు అగ్రస్థానం ఖరారైంది. మొరాకోకు రెండో స్థానంతో నాకౌట్‌ బెర్త్‌ దక్కింది.  

కెనెడా ఓడినా... 
టొరంటో: తాము ఆడిన గత రెండు ప్రపంచకప్‌లలో ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గని కెనడా జట్టు ఈసారి ఆతిథ్య దేశం హోదాలో సంచలన ప్రదర్శనతో నాకౌట్‌ దశకు చేరుకుంది. స్విట్జర్లాండ్‌తో జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి మ్యాచ్‌లో కెనడా 1–2తో ఓడిపోయింది. అయితే ఖతర్‌ జట్టుపై 6–0తో గెలిచి, బోస్నియా అండ్‌ హెర్జెగోవినాతో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న కెనడా నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు చేరుకుంది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న స్విట్జర్లాండ్‌ ఏడు పాయింట్లతో గ్రూప్‌ ‘బి’లో అగ్రస్థానం దక్కించుకొని నాకౌట్‌ బెర్త్‌ను సాధించింది. 

దక్షిణాఫ్రికా కొత్త చరిత్ర
మోంటెరె (మెక్సికో): నాలుగో ప్రయత్నంలో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్‌లో తొలిసారి నాకౌట్‌ దశకు చేరుకుంది. దక్షిణ కొరియా జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 1–0తో గెలిచింది. 63వ నిమిషంలో థపెలో మసెకో గోల్‌తో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని గ్రూప్‌ ‘ఎ’లో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత పొందింది. నాకౌట్‌ మ్యాచ్‌లో కెనడా జట్టుతో దక్షిణాఫ్రికా ఆడుతుంది. 1998, 2002, 2010 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.  

మెక్సికో ‘హ్యాట్రిక్‌’ 
మెక్సికో సిటీ: ప్రపంచకప్‌ ఆతిథ్య దేశాల్లో ఒకటైన మెక్సికో గ్రూప్‌ దశను అజేయంగా ముగించింది. చెక్‌ రిపబ్లిక్‌తో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో మెక్సికో 3–0తో గెలిచి ‘హ్యాట్రిక్‌’ విజయం అందుకుంది. మెక్సికో తరఫున మటియో చావెజ్‌ (55వ నిమిషంలో), జూలియన్‌ క్వినోనెస్‌ (61వ నిమిషంలో), అల్వారో ఫిడాల్గో (90+4వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన మెక్సికో తొమ్మిది పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. 

ప్రపంచకప్‌ చరిత్రలో గ్రూప్‌ దశలో ఒక్క గోల్‌ సమర్పించుకోకుండా ఆడిన మూడుమ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆరో జట్టుగా మెక్సికో గుర్తింపు పొందింది. ఈ జాబితాలో నెదర్లాండ్స్‌ (1978), బ్రెజిల్‌ (1986), ఇటలీ (1990), అర్జెంటీనా (1998), ఉరుగ్వే (2018) జట్లున్నాయి. 

గెలిచి నిలిచిన బోస్నియా 
సియాటెల్‌: నాకౌట్‌ దశకు చేరుకునే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బోస్నియా అండ్‌ హెర్జెగోవినా జట్టు అదరగొట్టింది. ఖతర్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘బి’ ఆఖరి మ్యాచ్‌లో బోస్నియా 3–1తో విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో బోస్నియా, కెనడా గ్రూప్‌ ‘బి’లో సమంగా నిలిచినా... గోల్స్‌ అంతరం కారణంగా కెనడా ముందంజ వేసింది. మూడో స్థానంలో ఉన్న ఎనిమిది అత్యుత్తమ జట్లలో బోస్నియా నిలిస్తే ఆ జట్టుకూ నాకౌట్‌ బెర్త్‌ లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement