అడ్డుగోడలా నిలబడి... | Cape Verde Stun European Champions Spain to Earn Historic FIFA World Cup Draw | Sakshi
Sakshi News home page

అడ్డుగోడలా నిలబడి...

Jun 16 2026 5:54 AM | Updated on Jun 16 2026 5:54 AM

Cape Verde Stun European Champions Spain to Earn Historic FIFA World Cup Draw

స్పెయిన్‌ను నిలువరించిన కేప్‌ వెర్డె గోల్‌కీపర్‌ వొజిన్హా

40 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రదర్శన

‘డ్రా’తో సరిపెట్టుకున్న ప్రపంచ మాజీ చాంపియన్‌

ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్న కేప్‌ వెర్డె జట్టు  

అట్లాంటా: ఒక జట్టేమో 17వసారి ప్రపంచకప్‌లో ఆడుతోంది... మరో జట్టుకేమో ఇదే తొలి ప్రపంచ కప్‌... అనుభవం, బలాబలాలదృష్ట్యా 17వసారి ప్రపంచకప్‌లో పోటీపడుతున్న జట్టు అలవోకగా గెలవాలి. కానీ అలా జరగలేదు. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా... పట్టుదలతో పోరాడితే అద్భుతం చేయవచ్చని ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన జట్టు నిరూపించింది. వెరసి తాజా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో గోల్స్‌ నమోదు కాకుండానే 0–0తో ‘డ్రా’ అయిన మ్యాచ్‌గా స్పెయిన్, కేప్‌ వెర్డె పోరు నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ప్రస్తుత యూరోపియన్‌ చాంపియన్‌ స్పెయిన్‌కు ఈ ప్రపంచకప్‌లో ఆశించిన ఆరంభం లభించలేదు.

 గ్రూప్‌ ‘హెచ్‌’లో భారీ విజయంతో బోణీ కొట్టాలని భావించిన స్పెయిన్‌కు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్న అనామక జట్టు కేప్‌ వెర్డెనుంచి ఊహంచని ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా కేప్‌ వెర్డె గోల్‌కీపర్, 40 ఏళ్ల వొజిన్హా అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఏకంగా ఏడుసార్లు స్పెయిన్‌ ప్లేయర్లు గోల్‌ పోస్ట్‌ లక్ష్యంగా కొట్టిన షాట్‌లను అతను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. స్పెయిన్‌ యువ సూపర్‌ స్టార్‌ లామినె యామల్‌ 71వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ ఆటగాళ్లు బంతిని 62 శాతం తమ ఆ«దీనంలో ఉంచుకున్నా కేప్‌ వెర్డె గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించడంలో విఫలమయ్యారు.  

నెదర్లాండ్స్‌ను నిలువరించిన జపాన్‌  2–2తో మ్యాచ్‌ ‘డ్రా’  
డాలస్‌: ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో ఆసియా జట్టు జపాన్‌ మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. 2020 టోర్నీలో మాజీ చాంపియన్లు జర్మనీ, స్పెయిన్‌లను ఓడించిన జపాన్‌... ఈసారి మరో పటిష్ట యూరోపియన్‌ టీమ్‌ నెదర్లాండ్స్‌ను నిలువరించింది. జపాన్, నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన గ్రూప్‌ ‘ఎఫ్‌’ మ్యాచ్‌ 2–2తో డ్రాగా ముగిసింది. నెదర్లాండ్స్‌ తరఫున వాన్‌ విర్జిల్‌ (50వ నిమిషంలో), సమ్మర్‌విల్లే (64వ నిమిషంలో) గోల్స్‌ సాధించగా... జపాన్‌ ఆటగాళ్లలో కీటో నకముర (57వ నిమిషంలో), కమాడా డైచీ (88వ నిమిషంలో) గోల్స్‌ కొట్టారు. దాదాపు మ్యాచ్‌ చివరి వరకు నెదర్లాండ్స్‌ ఆధిక్యం కొనసాగించగా... కమాడా అనూహ్య హెడర్‌తో స్కోరును సమం చేశాడు.  ప్రపంచకప్‌లో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా... ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయిన నెదర్లాండ్స్‌ తర్వాతి దశకు అర్హత సాధించే ప్రయత్నంలో గెలిచేందుకు అవకాశం ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకుంది. దాంతో డచ్‌ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

వెల్‌డన్‌... స్వీడన్‌
మరో గ్రూప్‌ ‘ఎఫ్‌’ మ్యాచ్‌లో స్వీడన్‌ 5–1 గోల్స్‌ తేడాతో ట్యునీషియాను చిత్తు చేసింది. 2893 రోజుల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్‌లో స్వీడన్‌ గోల్స్‌ ఖాతా తెరిచింది. 13వ సారి ప్రపంచకప్‌లో ఆడుతున్న స్వీడన్‌ తమ తొలి మ్యాచ్‌లోనే ఐదు గోల్స్‌ చేయడం ఇదే తొలిసారి. యాసిన్‌ అయారి (7వ, 90+6వ నిమిషంలో) రెండు గోల్స్‌ సాధించగా... అలెగ్జాండర్‌ ఇసాక్‌ (30వ నిమిషంలో), విక్టర్‌ గ్యోకర్స్‌ (59వ నిమిషంలో), మతియాస్‌ స్వాన్‌బెర్గ్‌ (84వ నిమిషంలో) ఒక్కో గోల్‌ కొట్టారు. ట్యునీషియా ఆటగాళ్లలో ఒమర్‌ రెకిక్‌ (43వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేశాడు. 2018లో క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన స్వీడన్‌ 2022 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు.  

19 మ్యాచ్‌ల తర్వాత... 
మరోవైపు ఈక్వెడార్‌తో జరిగిన గ్రూప్‌ ‘ఇ’ పోరులో ఐవరీకోస్ట్‌ 1–0తో విజయం సాధించింది. కొద్ది క్షణాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా సబ్‌స్టిట్యూట్‌ అమాద్‌ డియాలో (90వ నిమిషంలో) చేసిన ఏకైక గోల్‌తో ఐవరీకోస్ట్‌ అనూహ్యంగా గెలిచింది. దాంతో వరుసగా 19 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన ఈక్వెడార్‌కు తొలి ఓటమి ఎదురైంది. 2014లో చివరిసారి ప్రపంచకప్‌లో ఆడి ఓ మ్యాచ్‌లో గెలిచిన ఐవరీకోస్ట్‌... 2018, 2022 ప్రపంచకప్‌ టోరీ్నలకు అర్హత పొందలేదు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement