ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం..!? ఆ ఐదుగురికి గుడ్‌బై? | SRH Likely To Conduct Fitness Tests Ahead Of IPL 2027 Auction, Five Players Under Scanner For Release, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2027: ఎస్‌ఆర్‌హెచ్ కీలక నిర్ణయం..!? ఆ ఐదుగురికి గుడ్‌బై?

Aug 1 2026 8:35 AM | Updated on Aug 1 2026 11:23 AM

SRH Players Who Can Be Released Before IPL 2027 For Fitness Issues

PC: BCCI/IPL

ఐపీఎల్‌-2027 సీజన్ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బాటలోనే ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ కూడా తమ ఆటగాళ్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైనట్లు సమాచారం. 

ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్ధాయిలను అంచనా వేసి వారిని జట్టులో కొనసాగించాలా?  లేదా వేలంలోకి విడిచిపెట్టాలా? అని స‌న్‌రైజ‌ర్స్ నిర్ణ‌యం తీసుకోనుంది. కాగా సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ గ‌త 12 ఏళ్ల‌గా త‌మ రెండో టైటిల్ కోసం వేట కొనసాగిస్తోంది. 2016 సీజ‌న్‌లో ఛాంపియ‌న్‌గా నిలిచిన సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా విజ‌తేగా నిలవ‌లేదు. ఆరెంజ్ ఆర్మీ 2018, 2024 సీజ‌న్ల‌లో ఫైన‌ల్‌కు చేరిన‌ప్ప‌టికి ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది. 

ఐపీఎల్‌-2026లో ప్లేఆఫ్స్‌లోనే త‌మ ప్ర‌యాణాన్ని ముగించింది. దీంతో ఐపీఎల్‌-2027 కోసం బ‌ల‌మైన జ‌ట్టును సిద్దం చేయాల‌ని ఆరెంజ్ ఆర్మీ యాజ‌మాన్యం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఫిట్‌నెస్‌, ఫామ్‌, ప్రెస్‌ అధారంగా ఐపీఎల్‌-2027 మినీ వేలానికి ముందు స‌న్‌రైజ‌ర్స్ విడిచిపెట్టేందుకు అస్కారమున్న ఐదుగురు ఆట‌గాళ్ల‌పై ఓ లుక్కేద్దాం.

శివమ్ మావి
ఐపీఎల్‌-2026 వేలంలో శివ‌మ్ మావిని సన్‌రైజ‌ర్స్ రూ. 75 ల‌క్ష‌లకు కొనుగోలు చేసింది. కానీ అత‌డు తొడ కండ‌రాల గాయం కార‌ణంగా సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. అత‌డి ఫిట్‌నెస్‌పై ప్ర‌స్తుతానికి ఎలాంటి స‌మాచారం లేదు.  ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి యువ పేస‌ర్లు రాణిస్తుండ‌డంతో ప‌దేప‌దే గాయప‌డే మావిని స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు నుంచి రిలీజ్ చేసే అవ‌కాశ‌ముంది.

జాక్ ఎడ్వర్డ్స్
బిగ్‌బాష్ లీగ్‌-2026లో అద‌ర‌గొట్టిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ జాక్ ఎడ్వ‌ర్డ్స్‌ను రూ.3 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ సొంతం చేసుకుంది. కానీ అత‌డు పాదం గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్ నుంచి వైదొలిగాడు. ఆ త‌ర్వాత పున‌రాగ‌మ‌నంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.  మేజ‌ర్ లీగ్ క్రికెట్-2026లో ఎడ్వ‌ర్డ్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున కేవలం 12 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లో 10.12 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అత‌డిని ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో కొనసాగించే అవకాశాలు త‌క్కువ‌.

డేవిడ్ పేన్
జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో ప్రత్యామ్నాయంగా వచ్చిన ఇంగ్లండ్ వెట‌ర‌న్ పేస‌ర్ డేవిడ్ పేన్(రూ.1.5 కోట్లు) కూడా రెండు మ్యాచ్‌ల‌కే గాయం బారిన ప‌డ్డాడు. కాలిమడమ గాయంతో అత‌డు సీజ‌న్ మ‌ధ్య‌లోనే వైదొలిగాడు. ఈ క్ర‌మంలో వయసు, ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా  పేన్‌కు కూడా ఎస్ఆర్‌హెచ్ గుడ్‌బై చెప్పే అవ‌కాశ‌ముంది. అత‌డి స్ధానంలో మ‌రో యువ పేస‌ర్‌ను వెతికే ప‌నిలో స‌న్‌రైజ‌ర్స్ ప‌డింది.

హర్షల్ పటేల్ 
ఐపీఎల్‌లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన భారత వెటరన్ పేసర్ హర్షల్ పటేల్‌.. గత రెండు సీజన్లగా మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. ఐపీఎల్‌-2025 వేలంలో అతడిని రూ. 8 కోట్ల భారీ ధ‌ర‌కు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. కానీ అత‌డు మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయాడు. అతడి కంటే యువ పేస‌ర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌లు అద్భుతంగా రాణించారు. దీంతో అత‌డిని వేలంలో విడిచిపెట్టి ఆ మొత్తాన్ని యువ ఆట‌గాళ్ల‌పై ఖ‌ర్చు చేయాల‌ని స‌న్‌రైజ‌ర్స్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

లియామ్ లివింగ్‌స్టోన్
ఐపీఎల్‌-2026 వేంలో ఇంగ్లీష్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్‌పై ఎస్ఆర్‌హెచ్ భారీ ధ‌ర వెచ్చింది. రూ.13 కోట్ల‌కు అత‌డిని సొంతం చేసింది. కానీ అత‌డికి సీజ‌న్ మొత్తంలో  కేవ‌లం రెండు మ్యాచ్‌ల్లో మాత్ర‌మే ఆడే అవ‌కాశం ల‌భించింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో కూడా లివింగ్‌స్టోన్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో అత‌డిని విడిచిపెట్టి వేలంలో ఇతర విదేశీ ఆల్‌రౌండర్లపై దృష్టి పెట్టే యోచనలో ఎస్ఆర్‌హెచ్‌ ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement