ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇప్పటికే 2027 సీజన్ కోసం కసరత్తు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా మినీ వేలం నేపథ్యంలో ట్రేడ్ విండో ఓపెన్ కావడంతో తమకు కావాల్సిన ఆటగాళ్లను చేర్చుకునే విధంగా చర్చలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పేరు హైలైట్ అవుతోంది.
హార్దిక్ కోసం దాదాపు ఎనిమిది ఫ్రాంఛైజీలు ముంబై ఇండియన్స్‌తో బేరానికి దిగినట్లు తెలుస్తోంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. అయితే, ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా చెన్నై జట్టులోని ఓ యువ ఆటగాడి కోసం ముంబై పట్టుబడుతున్నట్లు సమాచారం.
కెప్టెన్‌గా భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించిన ఆయుశ్ మాత్రేను దక్కించుకోవాలని ముంబై పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ముంబైతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీలు కూడా ఈ యువ ఓపెనర్ కోసం గాలం వేసినట్లు తెలుస్తోంది.
గుజరాత్ టైటాన్స్.. ఆయుశ్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను చెన్నైకి ఆఫర్ చేయగా.. లక్నో షాబాజ్ అహ్మద్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ అశుతోశ్ శర్మ లేదంటే టి. నటరాజన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. సన్‌రైజర్స్ ఆయుశ్ కోసం సలీల్ అరోరాను త్యాగం చేసేందుకు సిద్ధమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. చెన్నై హార్దిక్‌కు బదులుగా ముంబైకి శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్‌ను ఇస్తామని.. చెప్పగా ముంబై మాత్రం ఆయుశ్‌ను కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, చెన్నై జట్టు మాత్రం ఆయుశ్‌ను తమ దీర్ఘకాలిక ఆస్తిగా భావిస్తూ ముంబైతో పాటు.. ఇతర ఫ్రాంఛైజీల ఆఫర్లను తిరస్కరించినట్లు తమిళ మీడియా పేర్కొంది.
ఇక హార్దిక్‌కు ఇచ్చినందుకు మూల్యంగా దూబే, బ్రెవిస్‌లతో పాటు అదనంగా రూ. 10 కోట్లు ఇచ్చేందుకు చెన్నై ఫ్రాంఛైజీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
ఆయుశ్‌కు అంత డిమాండ్ ఉందా?
దేశీ క్రికెట్‌లో ముంబైకి ఆడుతున్న ఆయుశ్ మాత్రే 2025లో ఐపీఎల్‌లో చెన్నై తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 240 పరుగులు సాధించాడు. ఇక తాజా ఎడిషన్‌లోనూ ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 201 పరుగులు చేశాడు.
అయితే, దురదృష్టవశాత్తూ గాయపడి టోర్నీ మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు ఆయుశ్. ఇప్పటి వరకు చెన్నై తరఫున మొత్తంగా 13 మ్యాచ్‌లలో కలిపి 441 పరుగులు చేసిన 19 ఏళ్ల ఆయుశ్.. స్ట్రైక్‌రేటు 177కు పైగానే ఉంది. రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, టీమిండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ మాదిరి దూకుడుగా ఆడగల సత్తా ఆయుశ్‌కు ఉంది.


