చరిత్ర సృష్టించా.. నా రక్తం ధారపోశాను.. కానీ ఇప్పుడు! | Neymar Confirms International Retirement, Emotional Retirement Message Goes Viral Says I Gave My Blood For Brazil | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించా.. నా రక్తం ధారపోశాను.. కానీ ఇప్పుడు!

Jul 29 2026 4:28 PM | Updated on Jul 29 2026 6:36 PM

I made history Gave my Life: Neymar Confirms International Retirement

PC: X/FIFA

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌ నెయ్‌మార్‌ జూనియర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టు కోసం రక్తం ధారపోశానని.. అయితే, ఇకపై ఆ పనిచేయలేనంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి పలికేశానంటూ రిటైర్మెంట్‌ గురించి పునరుద్ఘాటించాడు.

గత కొన్నాళ్లుగా గాయాలతో సావాసం చేసిన నెయ్‌మార్‌.. ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నీతో బ్రెజిట్‌ జట్టు తరఫున పునరాగమనం చేశాడు. అయితే, ఈ మెగా ఈవెంట్లో రౌండ్‌ 16లో నార్వే చేతిలో 2-1 గోల్‌ తేడాతో ఓడి బ్రెజిల్‌ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో నెయ్‌మార్‌ ఒక గోల్‌ కొట్టాడు. ఓటమి అనంతరం మాట్లాడుతూ.. బ్రెజిల్‌ తరఫున తనకు ఇదే చివరి మ్యాచ్‌ అని రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు.

తాజాగా ఇదే విషయం గురించి మరోసారి ప్రస్తావన రాగా.. ‘‘జాతీయ జట్టుతో నా బంధం ముగిసిపోయింది. బ్రెజిల్‌ తరఫున నేను చరిత్ర సృష్టించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా జట్టు కోసం రక్తం ధారపోశాను. నా జీవితాన్ని, సర్వస్వాన్ని అర్పించాను.

యెల్లో జెర్సీ ధరించడం కోసం ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ ఇకముందు ఆ పని చేయాల్సిన అవసరం లేదు’’ అని నెయ్‌మార్‌ గోల్‌.కామ్‌తో పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్‌ తర్వాత క్లబ్‌ కెరీర్‌ మీద దృష్టి సారించిన నెయ్‌మార్‌.. సారథిగా సాంటోస్‌ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.

ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో భాగంగా యూనివర్సిడాడ్‌ సెంట్రల్‌పై సాంటోస్‌ 4-2 గోల్‌ తేడాతో విజయం సాధించింది. తద్వారా కోపా సదమెరికానా రౌండ్‌ 16కు అర్హత సాధించింది. అనంతరం నెయ్‌మార్‌ మాట్లాడుతూ.. తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌ విషయాన్ని పునరుద్ఘాటించాడు.

కాగా బ్రెజిల్‌ తరఫున 130 మ్యాచ్‌లు ఆడిన నెయ్‌మార్‌.. 80 గోల్స్‌ సాధించాడు. తద్వారా బ్రెజిల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ కొట్టిన ఫుట్‌బాలర్‌గా 34 ఏళ్ల నెయ్‌మార్‌ చరిత్రకెక్కాడు. అంతేకాదు పదహారేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 59 అసిస్ట్‌లు కూడా అందించాడు. 

నెయ్‌మార్‌ ఘనతలు
అమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌ సందర్భంగా 2010లో నెయ్‌మార్‌ అరంగేట్రం చేశాడు. ఫిఫా ప్రపంచకప్‌ 2014, 2018, 2022, 2026 ఎడిషన్లలో బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్-2013 విజేత. 2012 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. 2016 ఒలింపిక్స్‌లో  కెప్టెన్‌గా బ్రెజిల్‌కు స్వర్ణం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement