జయహో జర్మనీ | German team started the latest World Cup with a strong victory | Sakshi
Sakshi News home page

జయహో జర్మనీ

Jun 15 2026 1:40 AM | Updated on Jun 15 2026 1:40 AM

German team started the latest World Cup with a strong victory

హ్యూస్టన్‌: గత రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్‌ దశలోనే ఇంటిదారి పట్టిన నాలుగుసార్లు చాంపియన్‌ జర్మనీ జట్టు తాజా ప్రపంచకప్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. తొలిసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఆడుతున్న కురసావ్‌ జట్టుతో ఆదివారం జరిగిన ‘ఇ’ లీగ్‌ మ్యాచ్‌లో జర్మనీ 7–1 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. 

జర్మనీ తరఫున ఫెలిక్స్‌ నెమాచా (6వ నిమిషంలో), నికో ష్కాల్టెర్‌బెక్‌ (38వ నిమిషంలో), జమాల్‌ ముసియాలా (47వ నిమిషంలో), నథానియల్‌ బ్రౌన్‌ (68వ నిమిషంలో), డెనిజ్‌ ఉండావ్‌ (78వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేయగా... కాయ్‌ హావెట్జ్‌ (45+5వ నిమిషంలో, 88వ నిమిషంలో) రెండు గోల్స్‌ సాధించాడు. కురసావ్‌ జట్టుకు లివానో కొమెన్సియా (21వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించాడు. 

‘డ్రా’తో గట్టెక్కిన బ్రెజిల్‌... 
గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోతో జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌ ఓటమి తప్పించుకొని 1–1తో గట్టెక్కింది. మొరాకో తరఫున ఇస్మాయిల్‌ సైబారి (21వ నిమిషంలో) గోల్‌ చేయగా... బ్రెజిల్‌ జట్టుకు వినిసియస్‌ జూనియర్‌ (32వ నిమిషంలో) గోల్‌ అందించాడు. పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో బ్రెజిల్‌ స్టార్‌ ప్లేయర్‌ నెమార్‌ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. 1938 ప్రపంచకప్‌ నుంచి బ్రెజిల్‌ జట్టు ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. 

ఈసారి తమ అజేయ రికార్డును కొనసాగించింది. గ్రూప్‌ ‘బి’లో ఖతర్, స్విట్జర్లాండ్‌ మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. 90+4వ నిమిషంలో స్విట్జర్లాండ్‌ ప్లేయర్‌ మిరో ముహీమ్‌ ‘సెల్ఫ్‌ గోల్‌’ చేసి తమ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. గ్రూప్‌ ‘సి’లోని మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 1–0తో హైతీ జట్టును ఓడించి 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 2–0తో టర్కీ జట్టుపై గెలిచింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement