ఫిఫా క్రేజ్‌: చూస్తే కిక్‌ రాదు.. అసలు మజా అందులోనే! | FIFA Fever In India, Do You Know These Common Football Terms, Every Fan Should Know To Enjoy The Game Better | Sakshi
Sakshi News home page

ఫిఫా క్రేజ్‌: ఫుట్‌బాల్‌ చూస్తే కిక్‌ రాదు.. అసలు మజా అందులోనే!

Jun 20 2026 9:06 AM | Updated on Jun 20 2026 10:19 AM

FIFA Fever in India: Do You Know These Common Football Terms

భారత్‌లో ఫుట్‌బాల్‌ క్రేజ్‌ మామూలుగా లేదిప్పుడు. ఫిఫా వరల్డ్‌కప్‌ నేపథ్యంలో.. ఐపీఎల్‌ తరహా సందడి వాతావరణం కనిపిస్తోంది. హోటళ్లు, పబ్‌లు, స్పోర్ట్స్‌ బార్లు అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. మెస్సీ, రొనాల్డో, ఎంబాప్పే, యమాల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్ల అభిమానులు తెరపైకి వచ్చేశారు. అయితే మ్యాచ్‌ జరిగేటప్పుడు కామెంటేటర్లు తరచూ వాడే పదాలకు చాలామందికి అర్థం మాత్రం తెలియదు. క్రికెట్‌ను కామెంటరీతో ఏలాగైతే ఆస్వాదిస్తామో..  ఫుట్‌బాల్‌ను మరింత ఆస్వాదించాలంటే ముందుగా ఆ ఆటలో వాడే కొన్ని పదాలను అర్థం చేసుకోవాల్సిందే.

గోల్‌ (Goal)..  ఫుట్‌బాల్‌లో అత్యంత ముఖ్యమైన పదం ఇదే. బంతి పూర్తిగా గోల్‌పోస్టుల మధ్య, క్రాస్‌బార్‌ కిందుగా గోల్‌లైన్‌ను దాటితే గోల్‌గా పరిగణిస్తారు. ఎక్కువ గోల్స్‌ చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది.

ఆఫ్‌సైడ్‌ (Offside)..  ఫుట్‌బాల్‌లో అత్యంత క్లిష్టమైన నిబంధనగా దీన్ని భావిస్తారు. ఆటగాడు బంతి అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్‌ కంటే ముందుంటే, అలాగే ఆటలో ప్రభావం చూపితే ఆఫ్‌సైడ్‌గా ప్రకటిస్తారు. గోల్‌ చేసినా అది చెల్లదు. చాలా వివాదాలు, వీఏఆర్‌ సమీక్షలు ఎక్కువగా ఈ నిబంధన చుట్టూనే తిరుగుతుంటాయి.

పెనాల్టీ (Penalty).. పెనాల్టీ బాక్స్‌లో డిఫెండర్‌ ఫౌల్‌ చేస్తే రిఫరీ పెనాల్టీ ఇస్తాడు. అప్పుడు బంతిని పెనాల్టీ స్పాట్‌పై ఉంచి ఒక ఆటగాడు నేరుగా గోల్‌పై షాట్‌ కొట్టే అవకాశం పొందుతాడు. ఫుట్‌బాల్‌లో గోల్‌ చేసే అత్యుత్తమ అవకాశాల్లో ఇది ఒకటి.

ఫ్రీ కిక్‌ (Free Kick).. ఫౌల్‌ జరిగినప్పుడు ప్రత్యర్థి జట్టుకు లభించే అవకాశం. డైరెక్ట్‌ ఫ్రీ కిక్‌.. నేరుగా గోల్‌ కొట్టవచ్చు. ఇన్‌డైరెక్ట్‌ ఫ్రీ కిక్‌.. మరో ఆటగాడు బంతిని తాకిన తర్వాత మాత్రమే గోల్‌ చెల్లుతుంది.

హ్యాట్రిక్‌ (Hat-trick).. ఒకే మ్యాచ్‌లో ఒక ఆటగాడు మూడు గోల్స్‌ చేస్తే దానిని హ్యాట్రిక్‌ అంటారు. మెస్సీ, రొనాల్డో, హ్యారీ కేన్‌, ఎర్లింగ్‌ హాలాండ్‌ వంటి స్టార్‌లు అనేక హ్యాట్రిక్‌లు సాధించారు అని తరచూ వింటుటాం కదా!.

క్లీన్‌ షీట్‌ (Clean Sheet).. గోల్‌కీపర్‌ లేదా జట్టు ప్రత్యర్థికి ఒక్క గోల్‌ కూడా ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగిస్తే దాన్ని క్లీన్‌ షీట్‌ అంటారు. డిఫెండర్లు, గోల్‌కీపర్లకు ఇది ప్రతిష్టాత్మక గణాంకం.

వీఏఆర్‌ (Video Assistant Referee).. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కి రివ్యూలాంటిది. మైదానంలో రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని వీడియోల ద్వారా పరిశీలించే వ్యవస్థ. ఇందులో..  గోల్‌ చెల్లుతుందా?,  పెనాల్టీ సరైందా?.. రెడ్‌ కార్డ్‌ ఇవ్వాలా? ఈ తరహా కీలక నిర్ణయాల్లో వీఏఆర్‌ ఉపయోగిస్తారు.

యెల్లో కార్డ్‌ – రెడ్‌ కార్డ్‌.. యెల్లో కార్డ్‌.. ఆటగాడికి హెచ్చరికగా ఇస్తారు. రెడ్‌ కార్డ్‌.. ఆటగాడిని వెంటనే మైదానం నుంచి పంపిస్తారు. ఆ జట్టు మిగతా మ్యాచ్‌ను ఒక ఆటగాడు తక్కువతో ఆడాల్సి ఉంటుంది.

ఎక్స్‌ట్రా టైమ్‌ (Extra Time).. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో నిర్ణీత 90 నిమిషాల తర్వాత స్కోరు సమంగా ఉంటే అదనంగా 30 నిమిషాలు ఆడిస్తారు.

పెనాల్టీ షూటౌట్‌ (Penalty Shootout).. ఎక్స్‌ట్రా టైమ్‌ తర్వాత కూడా ఫలితం తేలకపోతే రెండు జట్లు పెనాల్టీల ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. వరల్డ్‌కప్‌లలో ఎన్నో చారిత్రక మ్యాచ్‌లు ఇలాగే ముగిశాయి.

కార్నర్‌ కిక్‌ (Corner Kick).. ప్రత్యర్థి ఆటగాడు బంతిని తన గోల్‌లైన్‌ దాటి బయటకు పంపితే దాడి చేస్తున్న జట్టుకు కార్నర్‌ లభిస్తుంది. ఇవి తరచూ గోల్స్‌కు దారితీస్తుంటాయి.

థ్రో-ఇన్‌ (Throw-in).. బంతి సైడ్‌లైన్‌ దాటి బయటకు వెళ్తే చేతులతో మైదానంలోకి విసిరే విధానాన్ని థ్రో-ఇన్‌ అంటారు.

ఎక్స్‌జీ(xG) అంటే.. Expected Goals (xG) అనే ఆధునిక గణాంకం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది.
ఒక షాట్‌ గోల్‌గా మారే అవకాశాన్ని శాతం రూపంలో కొలుస్తుంది. జట్టు ఎలా ఆడిందో అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

డర్బీ (Derby).. ఒకే నగరం లేదా ప్రాంతానికి చెందిన రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను డర్బీ అంటారు. ఉదాహరణకు.. రియల్‌ మాడ్రిడ్‌-అట్లెటికో మాడ్రిడ్‌, అలాగే.. ఏసీ మిలాన్‌ వర్సెస్‌ ఇంటర్‌ మిలాన్‌ ఇలాగన్నమాట.

ట్రెబుల్‌ (Treble).. ఒకే సీజన్‌లో లీగ్‌, దేశీయ కప్‌, ఖండాంతర టోర్నీ గెలిస్తే ట్రెబుల్‌ అంటారు. ఇది ఫుట్‌బాల్‌లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటి.

ఫుట్‌బాల్‌ కేవలం 22 మంది ఆటగాళ్లు బంతి వెంట పరుగెత్తే ఆట కాదు. దానికి సొంత భాష, సొంత వ్యూహాలు, సొంత పదజాలం ఉన్నాయి. "ఆఫ్‌సైడ్‌" ఎందుకు ఇచ్చారు? "వీఏఆర్‌" ఎందుకు జోక్యం చేసుకుంది? "క్లీన్‌ షీట్‌" అంటే ఏమిటి? వంటి విషయాలు అర్థమైతే మ్యాచ్‌ చూడటంలోనే కాదు.. చర్చల్లో పాల్గొనడంలోనూ మజా పెరుగుతుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ను ప్రేమించే భారతీయులు పెరుగుతున్న ఈ సమయంలో.. ఆ ఆటకు సంబంధించిన భాషను నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement