క్రీడల్లో ఆన్ ఫీల్డ్ ప్రదర్శన ఎంత ముఖ్యమో, ఆఫ్ ద ఫీల్డ్ ప్రవర్తన కూడా అంతే కీలకం. రెండిటిలో ఏది సరిగ్గా లేకపోయినా, ఆటగాళ్ల కెరీర్‌లు అర్దంతరంగా ముగిసిపోతాయి. తాజాగా ఓ భారత యువ క్రికెటర్ పెద్దగా పరిచయం లేని యువతితో సోషల్‌మీడియాలో అసభ్యకరమైన సంభాషణ చేసి వార్తల్లోకెక్కాడంతో ఈ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి మూల్యం చెల్లించుకున్న అంతర్జాతీయ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.
ఈ జాబితాతో ముందుగా వచ్చేది టీమిండియా ఆటగాడు పృథ్వీ షా. అద్భుతమైన టాలెంట్ కలిగి, క్రమశిక్షణ లేకపోవడం వల్ల కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ మహారాష్ట్ర ఆటగాడు.. 2023లో ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్లిక్‌లో ఘర్షణకు దిగి అప్పటికే పతనమైన కెరీర్‌ను అదఃపాతాళానికి పడేసుకున్నాడు. ఈ ఎడిసోడ్ కారణంగా షా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోనప్పటికీ.. కెరీర్‌లో నిలదొక్కుకునే అవకాశాలు కోల్పోయాడు.
ఈ జాబితాలో రెండో పేరు లూక్ పోమర్స్‌బాచ్. ఆ మాజీ ఆసీస్ ఆటగాడు 2013 ఐపీఎల్ సందర్భంగా ఢిల్లీలో ఓ మహిళపై దాడి చేసి కటకటాలపాలయ్యాడు. ఆ తర్వాత ఆ కేసు సెటిల్‌మెంట్‌కు వచ్చినప్పటికీ.. పోమర్స్‌బాచ్ కెరీర్ పెద్దగా ముందుకు సాలేదు.
రుబెల్ హొసైన్
ఈ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ 2015లో నటి నజ్నిన్ ఆక్టర్ హ్యాపీపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నిలబడనప్పటికీ.. రుబెల్ కెరీర్‌లో ఇది మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఉదంతం తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.
మొహమ్మద్ షహ్జాద్
ఈ ఆఫ్ఘనిస్తాన్ విధ్వంసకర బ్యాటర్ 2018లో ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతం తర్వాత షహ్జాద్ క్రికెట్ సర్కిల్స్ నుంచి కనుమరుగయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణలో షహ్జాద్ తప్పుచేసినట్లు తేలిందని ప్రచారం జరిగింది.
దనుష్క గుణతిలక
శ్రీలంకకు చెందిన ఈ మాజీ ఆటగాడు 2018లో ఇంగ్లండ్‌లో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇతగాడు 2022లో ఆస్ట్రేలియాలో కూడా ఓ మహిళపై లైంగిక దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ కేసులో గుణతిలక అరెస్టు కూడా అయ్యాడు. ఈ రెండు ఉదంతాల కారణంగా అతని కెరీర్ పట్టాలెక్కకుండానే గాడి తప్పింది. గుణతిలక చెడుకు శ్రీలంక క్రికట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు.
అంతర్జాతీయ క్రికెటర్లు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. తాజాగా ఆర్సీబీ మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా ఓ మహిళతో సోషల్‌మీడియా వేదికగా అసభ్యంగా సంభాషిస్తూ వార్తల్లోకెక్కాడు. తనతో చికారా చేసిన అభ్యంతరకరమైన చాట్‌ను సదరు యువతి సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అదే యువతి తాజాగా మరో ఐపీఎల్ ఆటగాడు (డీసీకి చెందిన అభిషేక్ పోరెల్) కూడా తనతో చాట్ చేశాడని పోస్ట్ పెట్టింది.


