టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్లేనా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో రవీంద్ర జడేజా పేరు లేకపోవడంతో.. సెలక్టర్లు అతడికి విశ్రాంతి ఇచ్చారని అంతా అనుకున్నారు.
కానీ తాజాగా ఇంగ్లండ్‌తో వన్డేలకు సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టులోనూ జడ్డూకు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది. జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లను ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్లుగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
కాగా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా.. ప్రస్తుతం వన్డేలు, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ అతడికి ప్రత్యామ్నాయ ఆప్షన్స్ సెలక్టర్లు వెతుకున్నారు. ఇప్పటికే రెడ్‌బాల్ క్రికెట్‌లో జడ్డూ స్ధానంలో జట్టులోకి వచ్చిన మానవ్ సుతార్ తన సత్తాను నిరూపించుకున్నాడు. కానీ ప్రధాన టెస్ట్ సిరీస్‌లకు జడేజాకు తిరిగి పిలపునిచ్చే అవకాశముంది.
వన్డేల్లో కూడా ఇప్పుడు సుందర్ లేదా అక్షర్‌లో ఎవరో ఒకరిని జడ్డూ బ్యాకప్‌గా తాయారు చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ టూర్‌కు టీమ్ ప్రకటన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు.
"రవీంద్ర జడేజా ఎలాంటి ప్లేయరో మాకు బాగా తెలుసు. 2027 ప్రపంచకప్‌నకు ఇంకా 15-16 నెలల సమయం ఉంది. ఈ లోగా ప్రత్యామ్నాయ బ్యాకప్ ఆప్షన్లను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించాం. అందుకే యువ ఆటగాళ్లను పరీక్షించేందుకే జడేజాకు విశ్రాంతినిచ్చామని" అగార్కర్ పేర్కొన్నాడు. కానీ అగార్కర్ వ్యాఖ్యలు బట్టి 37 ఏళ్ల జడేజా టీమిండియా వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికలలో లేనిట్లు ఆర్ధమవుతోంది.
ఎందుకంటే జడేజా 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి 38 ఏళ్లకు చేరుకుంటాడు. దీంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఆటగాళ్ల కంటే యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని భావిస్తోంది. జడేజా ఇకపై కేవలం టెస్ట్ స్పెషలిస్ట్‌గానే కొనసాగే అవకాశముంది.
జడేజా చివరగా భారత తరపున ఈ ఏడాది జనవర్‌లో న్యూజిలాండ్‌పై వన్డే మ్యాచ్ ఆడాడు. జడేజాకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 210 మ్యాచ్‌లు ఆడి 232 వికెట్లతో పాటు 2905 పరుగులు సాధించాడు. ఏదేమైనప్పటికి జట్టులో జడేజా లాంటి ఆల్‌రౌండర్ స్ధానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు.


