కొలంబియా ముందుకు... | Colombia wins second consecutive World Cup football match | Sakshi
Sakshi News home page

కొలంబియా ముందుకు...

Jun 25 2026 3:59 AM | Updated on Jun 25 2026 3:59 AM

Colombia wins second consecutive World Cup football match

వరుసగా రెండో విజయంతో నాకౌట్‌ బెర్త్‌ ఖరారు

ఏకైక గోల్‌తో గెలిపించిన మునోజ్‌

గ్వాడలహారా (మెక్సికో): ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయకుండా ఆడిన కొలంబియా జట్టు ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్‌ ‘కె’లో భాగంగా కాంగో జట్టుతో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో కొలంబియా 1–0 గోల్‌ తేడాతో గెలిచింది. 76వ నిమిషంలో డేనియల్‌ మునోజ్‌ ఏకైక గోల్‌ చేసి కొలంబియా జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో కొలంబియా నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పటిష్టమైన పోర్చుగల్‌ జట్టును తొలి మ్యాచ్‌లో 1–1తో నిలువరించిన కాంగో జట్టు ఈ మ్యాచ్‌లోనూ కొలంబియాకు గట్టిపోటీ ఇచ్చింది. 

తొలి 20 నిమిషాల్లో కొలంబియా ఐదుసార్లు గోల్‌ చేసేందుకు అవకాశాలు సృష్టించుకున్నా కాంగో గోల్‌కీపర్‌ లియోనెల్‌ ఎంపాసి అడ్డుగోడలా నిలబడ్డాడు. ఎట్టకేలకు 76వ నిమిషంలో కొలంబియా ఖాతా తెరిచింది. యువాన్‌ క్వింటెరో అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అడ్డుకోవడంలో కాంగో డిఫెండర్లు విఫలమయ్యారు. అక్కడే ఉన్న మునోజ్‌ కాంగో గోల్‌కీపర్‌కు అవకాశం ఇవ్వకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 52 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో మళ్లీ ఆడుతున్న కాంగో జట్టుకు ఈ ఓటమితో నాకౌట్‌ దశ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 

ఘనా 0–0 ఇంగ్లండ్‌ 
బోస్టన్‌: గత నాలుగు ప్రపంచకప్‌లలో ఘనా జట్టు తమ రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఓడిపోలేదు. అదే రికార్డును ఐదో ప్రపంచకప్‌లోనూ కొనసాగించింది. గ్రూప్‌ ‘ఎల్‌’లో భాగంగా మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌ను ఘనా 0–0తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌తో సహా ఇతర ఆటగాళ్లు 19 సార్లు ఘనా గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా షాట్‌లు సంధించినా గోల్‌ మాత్రం చేయలేకపోయారు. 

మరోవైపు ఘనా జట్టు రక్షణాత్మక ఆటతీరుకే ప్రాధాన్యం ఇచ్చింది. ఆ జట్టు రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్‌ గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4–2తో క్రొయేషియాపై, ఘనా 1–0తో పనామాపై గెలిచాయి. ప్రస్తుతం  ఇంగ్లండ్, ఘనా జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.

గెలిచి నిలిచిన క్రొయేషియా
టొరంటో: గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్‌ చేరిన క్రొయేషియా జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. గ్రూప్‌ ‘ఎల్‌’లో భాగంగా పనామా జట్టుతో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో క్రొయేషియా 1–0 గోల్‌ తేడాతో గెలిచింది. ఆట 54వ నిమిషంలో కుడి వైపు నుంచి జోసిప్‌ స్టానిసిక్‌ అందించిన క్రాస్‌ పాస్‌ను ‘డి’ ఏరియా లోపల యాంటె బుడిమిర్‌ లక్ష్యానికి చేర్చాడు. ఈ విజయంతో క్రొయేషియా మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నాకౌట్‌ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement