
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) మండిపడ్డాడు. సల్మాన్ జట్టుకు బలహీనతగా మారాడని.. తనేం చేస్తున్నాడో తనకైనా అర్థమవుతోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కోచ్ మైక్ హసన్ నిర్ణయం చెత్తగా ఉందంటూ అక్తర్ విమర్శించాడు.
ఆసియా కప్-2025 టీ20 టోర్నమెంట్లో భారత్ చేతిలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో సూర్యకుమార్ సేన చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక సూపర్-4లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు...
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58)తో రాణిచంగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా 13 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇదిలా ఉంటే.. భారత్ ఏడు బంతులు మిగిలి ఉండగానే పాక్ విధించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా బ్యాటింగ్ స్థానంలో ఆరో ఆటగాడిగా రావడం పట్ల అక్తర్ స్పందించాడు.
అతడికి అసలు ఆ అర్హత ఉందా?
‘‘జట్టులో బలహీనమైన లింక్ ఏదైనా ఉందంటే.. సల్మాన్ ఆఘానే. అసలు అతడు ఆరోస్థానంలో ఆడేందుకు అర్హుడా? మిడిలార్డర్‌లో వీకెస్ట్ లింక్. అతడు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.
టీమిండియాతో మ్యాచ్‌లో డౌన్‌లో వస్తాడా? హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి వాళ్లు భారత జట్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారా?.. ప్రత్యర్థి జట్టుతో కనీసం పోలికైనా అక్కర్లేదా?
కోచ్ చెప్పిన మాట వినడం మంచిదే. కానీ దాని వల్ల ఉపయోగం లేనపుడు ఎందుకు అలా చేయడం?.. కోచ్ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్‌గా తనేం చేస్తున్నాడో అసలు సల్మాన్‌కైనా తెలుసా?’’ అంటూ అక్తర్ ఫైర్ అయ్యాడు. కాగా ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో పాకిస్తాన్ మంగళవారం శ్రీలంకతో చావో రేవో తేల్చుకోనుంది. అబుదాబి ఇందుకు వేదిక.
చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. గుడ్‌బై చెప్పేసి..