వచ్చే ఏడాది (2026) జనవరి 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్ 2026కు ముందు 2024 ఎడిషన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికి దూరం కానుంది. పెర్రీ స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం దేశీయ ఆల్‌రౌండర్ సయాలీ సత్ఘరేతో భర్తీ చేసింది.
సత్ఘరే గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఈ సీజన్ వేలంలో సత్ఘరేను (30 లక్షలు) ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. తాజాగా ఎల్లిస్ లీగ్ నుంచి తప్పుకోవడంతో సత్ఘరేను అదృష్టం వరించింది. ఎల్లిస్ వైదొలిగిన తర్వాత ఆర్సీబీలో నడినే డి క్లెర్క్ మాత్రమే నాణ్యమైన విదేశీ ఆల్‌రౌండర్‌గా ఉంది.
ఎల్లిస్ ఆర్సీబీ 2024లో టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఎల్లిస్‌కు డబ్ల్యూపీఎల్ మొత్తంలోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్ ఎల్లిసే. ఈ లీగ్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్.. 8 హాఫ్ సెంచరీల సాయంతో 972 పరుగులు చేసి, 8.25 ఎకానమీతో 14 వికెట్లు తీసింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా..!
డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, ఆసీస్ ప్లేయరే అయిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ కూడా వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికే దూరం కానుంది. సదర్‌ల్యాండ్ స్థానాన్ని డీసీ యాజమాన్యం అలానా కింగ్‌తో భర్తీ చేసింది.


