
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఐదో టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్‌తో ఓవల్ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా బీసీసీఐ ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
ఇక జట్టును వీడిన బుమ్రాకు సెప్టెంబరులో జరిగే ఆసియా కప్-2025 (Asia Cup) వరకు సుదీర్ఘ కాలం విశ్రాంతి లభించనుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతోంది.
ఓవల్ టెస్టులో గెలిస్తేనే సమం
ఈ క్రమంలో ఇంగ్లండ్ గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకోగలుగుతుంది. అయితే, పనిభారం తగ్గించే క్రమంలో ప్రధాన పేసర్ బుమ్రాను ఇంగ్లండ్‌లో కేవలం మూడు టెస్టుల్లోనే ఆడిస్తామని మేనేజ్‌మెంట్ ముందుగానే ప్రకటించింది.
అందుకు తగ్గట్లుగానే లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చి.. వెంటనే మాంచెస్టర్ టెస్టు కూడా ఆడాడు. అయితే, కీలకమైన ఐదో టెస్టులో ఆడతాడని భావించినా.. ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా యాజమాన్యం అతడికి రెస్ట్ ఇచ్చింది.
తాజాగా జట్టు నుంచి రిలీజ్ చేసింది. కాగా ఇంగ్లండ్‌తో ఆడిన మూడు టెస్టుల్లో ఈ రైటార్మ్ పేసర్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి.. 14 వికెట్లు కూల్చాడు.
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు భారత జట్టు (అప్‌డేటెడ్)
శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, అర్ష్దీప్ సింగ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).
ఆసియా కప్ నాటికి తిరిగి వస్తాడా?
ఆసియాకప్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నట్లు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహసిన్ నఖ్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబరు 14న గ్రూప్ దశ మ్యాచ్, 21న ‘సూపర్ ఫోర్’ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.
ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనుండగా... దుబాయ్, అబుదాబిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. యూఏఈ, ఒమాన్, పాకిస్తాన్‌తో కలిసి భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ గ్రూప్ ‘బి’లో పోటీపడనున్నాయి.
ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ కేవలం తటస్థ వేదికల్లోనే తలపడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించనున్నారు.
ప్రసారదారులతో ఏసీసీ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ నుంచి పోటీపడనున్నాయి. దీంతో గ్రూప్ స్థాయిలో, ‘సూపర్ ఫోర్’ దశతో పాటు ఫైనల్లో ఇరు జట్లు పోటీపడే అవకాశాలున్నాయి.
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుండటంతో... ఆసియాకప్‌ను అదే ఫార్మాట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మెగా టోర్నీ నాటికి బుమ్రా తిరిగి వస్తాడో లేదో చూడాలి.
చదవండి: ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా