ఇంగ్లండ్‌కు పరాభవం.. యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌ ఓటమి | Australia Beat England By 89 Runs In One Off Womens Ashes Series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు పరాభవం.. యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌ ఓటమి

Jun 27 2023 9:02 AM | Updated on Jun 27 2023 9:02 AM

Australia Beat England By 89 Runs In One Off Womens Ashes Series - Sakshi

నాటింగ్‌హమ్‌: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మల్టీ ఫార్మాట్‌ యాషెస్‌ సిరీస్‌లో ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. మూడు ఫార్మాట్ల ఫలితాలతో విజేత ఖరారయ్యే ఈ సిరీస్‌లో ఆసీస్‌ అమ్మాయిలు ఏకైక టెస్టులో గెలిచి ఆధిక్యంలోకి వచ్చారు. ఇక ఈ యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే తదుపరి జరిగే  ఆరు మ్యాచ్‌ల్లో (మూడు టి20లు, మూడు వన్డేలు) ఐదింట గెలవాలి. సోమవారం ముగిసిన టెస్టులో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ జట్టును ఓడించింది. ఆసీస్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (8/66) ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. భారత స్పిన్నర్‌ నీతూ డేవిడ్‌ (8/53; 1995లో ఇంగ్లండ్‌పై) తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆష్లే నిలిచింది. 

268 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు 116/5తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లోనే ఆలౌటైంది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 49 ఓవర్లలో 178 పరుగుల వద్ద ముగిసింది. నాలుగో రోజు ఆటలోనే 3 కీలక వికెట్లు తీసిన ఆష్లే చివరి రోజు ఉదయం మరో ఐదు వికెట్లను పడగొట్టింది. ఈ టెస్టులో ఆమె మొత్తం 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 4) పడగొట్టింది. తద్వారా మహిళల టెస్టు చరిత్రలో రెండో ఉత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసింది. ఈ జాబితాలో పాక్‌ బౌలర్‌ షాయిజా ఖాన్‌ (2004లో విండీస్‌పై 13 వికెట్లు) అగ్రస్థానంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్‌ 473, ఇంగ్లండ్‌ 463 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌ లో ఆ్రస్టేలియా 257 పరుగులు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement