
ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్లో అసలైన పోటీ మొదలైంది. లీగ్ దశలో సత్తా చాటిన టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టైటిల్ వేటలో భాగంగా బంగ్లా- లంక మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో.. బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది.
బంగ్లా సంచలన విజయంతో
ఆఖరి వరకు పట్టువదలకుండా పోరాడి.. శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. ముందంజ వేసింది. ఇక ఆదివారం (సెప్టెంబరు 21) నాటి మ్యాచ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో భారత తుదిజట్టులో కీలక మార్పు జరిగే అవకాశం ఉంది.
బుమ్రా రీఎంట్రీ.. ఆ ఇద్దరిపై వేటు
లీగ్ దశలో ఆఖరిగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం లాంఛనమే. అదే విధంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.
అక్షర్ దూరమైతే మాత్రం
అయితే, ఒమన్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడిన అక్షర్ తల మైదానాన్ని బలంగా కొట్టుకోవడంతో.. అతడు గ్రౌండ్ వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌కు అక్షర్ దూరమయ్యే అవకాశం ఉంది.
అదే జరిగితే అర్ష్‌దీప్ లేదంటే హర్షిత్‌లలో ఒకరు తమ స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున వంద వికెట్ల క్లబ్‌లో చేరిన అర్ష్ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతుందా?.. లేదంటే హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడు హర్షిత్‌కు ఓటు వేస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. ఈ స్వల్ప మార్పులు మినహా భారత్ పాత జట్టుతోనే పాక్‌తో బరిలో దిగే అవకాశం ఉంది.
గ్రూప్-ఎ టాపర్‌గా టీమిండియా
గ్రూప్-ఎలో భాగంగా యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లపై హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా.. టాపర్‌గా సూపర్-4లో అడుగుపెట్టింది. ఇదే గ్రూపు నుంచి యూఏఈ, ఒమన్‌లపై విజయాలతో పాక్ కూడా సూపర్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్, హాంకాంగ్‌లను ఎలిమినేట్ చేసి.. శ్రీలంక, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి.
భారత్ వర్సెస్ పాకిస్తాన్ సూపర్-4
భారత తుదిజట్టు అంచనా:
అభిషేక్ శర్మ (ఓపెనర్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఓపెనర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్-బ్యాటర్), తిలక్ వర్మ (బ్యాటర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్ బ్యాటర్), శివం దూబే (ఆల్‌రౌండర్), హార్దిక్ పాండ్యా (ఆల్‌రౌండర్), అక్షర్ పటేల్ (ఆల్‌రౌండర్)/అర్ష్‌దీప్ సింగ్ (పేసర్), వరుణ్ చక్రవర్తి (స్పిన్నర్), కుల్దీప్ యాదవ్(స్పిన్నర్), జస్‌ప్రీత్ బుమ్రా (పేసర్).