
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో (India vs Pakistan) పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్ (Haris Rauf), సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే.
ఆ మ్యాచ్‌లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు.
ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్‌లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పాక్ ఆటగాళ్లు చేసిన ఈ ఓవరాక్షన్‌పై బీసీసీఐ అభ్యంతం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
దీనిపై రౌఫ్, ఫర్హాన్ ఇవాళ (సెప్టెంబర్ 26) విచారణ ఎదుర్కొన్నారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ (Richie Richardson) ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (Level 1 offence) ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్ చేస్తే సహించేది లేదంటూ రౌఫ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాగా మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం కోత విధించారు. ఫర్హాన్‌కు సైతం వార్నింగ్ ఇస్తూ.. మందలింపుతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
సూర్యకుమార్‌కు జరిమానా
ఇదే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆ విజయాన్ని సూర్యకుమార్ "ఆపరేషన్ సిందూర్" అనే ప్రభుత్వ చర్యను ప్రస్తావిస్తూ, భారత మిలిటరీ సర్వీసెస్‌కు అంకితం చేశాడు.
ఈ వ్యాఖ్యలపై పీసీబీ అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సూర్యకుమార్‌ను సైతం విచారణ చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అలాగే మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం విధించినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ఇదివరకే రెండు సార్లు (గ్రూప్ దశ, సూపర్-4) తలపడిన భారత్-పాకిస్తాన్.. ఆదివారం జరుగబోయే ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. పై రెండు సందర్భాల్లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించింది.