
త్వరలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (India vs West Indies) కోసం భారత జట్టును (Team India) నిన్న (సెప్టెంబర్ 25) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించిన విధంగానే ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన కరుణ్ నాయర్‌కు (karun Nair) చోటు దక్కలేదు. కరుణ్‌పై వేటు అంశం నిన్నటి నుంచి భారత క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా ఉంది.
చాలామంది కరుణ్‌ను తప్పించడం సమంజసమే అని అంటుంటే.. కొందరు మాత్రం అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కరుణ్ స్వయంగా స్పందించాడు. ఓ ప్రముఖ వార్త సంస్థతో మాట్లాడుతూ..
"సెలెక్ట్ చేస్తారని అనుకున్నా. కానీ చేయలేదు. దీని గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. చివరి టెస్ట్‌లో ఫిఫ్టీ చేశాను. ఆ ఇన్నింగ్స్‌లో మరెవ్వరూ ఈ మార్కును తాకలేకపోయారు. ఆ మ్యాచ్‌లో (ఓవల్ టెస్ట్) టీమిండియా గెలిచింది. అయినా ఇవన్నీ సెలెక్టర్లకు పట్టవంటూ" అవేదనకు లోనయ్యాడు.
ఇదే అంశంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ కూడా స్పందించాడు. అతని వాదన వేరేలా ఉంది. కరుణ్ నుంచి చాలా ఆశించినట్లు చెప్పుకొచ్చాడు. కరుణ్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్న దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) చాలా ఆప్షన్స్ ఇస్తాడని అన్నాడు.
కరుణ్ మంచి ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీమ్ ట్రాన్సిషన్‌లో ఉంది. ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని పడిక్కల్‌ను ఎంపిక చేశాం. ప్రతి ఆటగాడికి 15-20 అవకాశాలు ఇవ్వాలనుకుంటాం. కానీ, అది ఎప్పుడూ సాధ్యపడదని పేర్కొన్నాడు.
కాగా, ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీతో రాత్రికిరాత్రి హీరో అయిపోయి, అతి కొద్ది కాలంలోనే ఫామ్ కోల్పోయి కనుమరుగైన కరుణ్ నాయర్.. ఆతర్వాత ఏళ్ల తరబడి దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటి ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు కూడా అతను భారత జట్టులో ఎంతో కాలం నిలువలేకపోయాడు. కేవలం 8 ఇన్నింగ్స్‌ల్లోనే అతని ఖేల్ ఖతమైంది.
ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ 8 ఇన్నింగ్స్‌ల్లో 25.62 సగటున కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో కరుణ్‌కు మంచి ఆరంభాలు లభించినా, వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు అతన్ని విండీస్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.
చదవండి: వైభవ్ విఫలమైనా..! ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా