
మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లో (Australia U19 vs India U19) యువ భారత్ జట్టు (Team India) ఆస్ట్రేలియాను (Australia) వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మూడో వన్డేలో టీమిండియా 167 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో (22 బంతుల్లో 38, 68 బంతుల్లో 70) సత్తా చాటిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మూడో మ్యాచ్‌లో (20 బంతుల్లో 16) విఫలమయ్యాడు. అయినా భారత్ ఘన విజయం సాధించగలిగింది. ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో, రెండో వన్డేలో 51 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు తొలి యూత టెస్ట్ జరుగనుంది. అనంతరం అక్టోబర్ 7 నుంచి 10 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. దీంతో ఆస్ట్రేలియాలో యువ భారత జట్టు పర్యటన ముగుస్తుంది.
మూడో వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. వైభవ్ విఫలమైనా, వేదాంత్ త్రివేది (86), రాహుల్ కుమార్ (62) రాణించారు. విహాన్ మల్హోత్రా (40) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.
అనంతరం 281 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. భారత బౌలర్లు ఖిలన్ పటేల్ (7.3-0-26-4), ఉధవ్ మోహన్ (5-1-26-3), కనిష్క్ చౌహాన్ (6-1-18-2) ధాటికి 28.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అలెక్స్ టర్నర్ 32, టామ్ హోగన్ 28, విల్ మలాజ్‌చుక్ 15 పరుగులు చేశారు.
చదవండి: IND vs AUS: కేఎల్ రాహుల్ భారీ సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్