
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) టెస్టు కెరీర్ ముగిసినట్లేనా?.. సెలక్టర్లు అతడికి తలుపులు పూర్తిగా మూసివేశారా?.. సంప్రదాయ ఫార్మాట్లో అతడి రీఎంట్రీ ఇక లేనట్లేనా?.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది.
టీమిండియా తరఫున రెండేళ్ల క్రితం టెస్టు మ్యాచ్ ఆడాడు షమీ. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2023 ఫైనల్లో ఆఖరిగా ఆడి.. మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో లీడ్ వికెట్ టేకర్‌గా నిలిచిన ఈ రైటార్మ్ పేసర్.. ఆ తర్వాత చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు.
కోలుకునే క్రమంలో చాలాకాలం ఆటకు దూరమైన షమీ.. దేశీ క్రికెట్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనను తాను నిరూపించుకుని టీమిండియా తరఫున వన్డేల ద్వారా రీఎంట్రీ ఇచ్చిన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.
చోటే లేదు
ఇక టెస్టు కెరీర్ విషయానికొస్తే.. 2023 తర్వాత మళ్లీ షమీ జట్టుకు ఎంపికకాలేదు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన.. ఈ ఏడాది ఇంగ్లండ్ టూర్‌లోనూ సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా షమీ దూరంగా ఉన్నట్లు చెప్పారు. కానీ అతడు మాత్రం స్పందించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు కూడా సెలక్టర్లు షమీని పక్కనపెట్టారు. స్వదేశంలో జరిగే ఈ సిరీస్ ఆడే భారత పేస్ విభాగంలో ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణలకు చోటిచ్చారు. అదే విధంగా.. పేస్ ఆల్‌రౌండర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డికి స్థానం కల్పించారు.
కుండబద్దలు కొట్టిన అగార్కర్
అయితే, జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. షమీ గురించి ఎదురైన ప్రశ్నకు ‘అతడి అంశంపై అప్‌డేట్ లేదు’ అని జవాబిచ్చాడు. ‘‘అతడి గురించి నాకు అప్‌డేట్ లేదు. అతడు దులిప్ ట్రోఫీలో ఆడాడు. కానీ గత రెండు- మూడేళ్లుగా రెడ్ క్రికెట్‌లో అతడు ఎక్కువగా ఆడలేదు.
బెంగాల్ తరఫున దులిప్ ట్రోఫీలోనూ ఒక్కటే మ్యాచ్ ఆడి ఉంటాడనుకుంటా. బౌలర్‌గా తనేం చేయగలడో మాకు తెలుసు. కానీ ఎక్కువ మ్యాచ్‌లలో ఆడితేనే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది’’ అని అగార్కర్ కుండబద్దలు కొట్టాడు. తద్వారా ఇప్పట్లో షమీ టెస్టు రీఎంట్రీ లేదనే సంకేతాలు ఇచ్చాడు.
చదవండి: IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్