IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్‌ అగార్కర్‌ | Ajit Agarkar Tells Why has Sarfaraz Khan not been picked for IND vs WI Test | Sakshi
Sakshi News home page

IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్‌ అగార్కర్‌

Sep 25 2025 3:44 PM | Updated on Sep 25 2025 4:01 PM

Ajit Agarkar Tells Why has Sarfaraz Khan not been picked for IND vs WI Test

టీమిండియా యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan)ను మరోసారి దురదృష్టం వెంటాడింది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ (IND vs WI) ఆడే భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే, ఈసారి గాయం వల్ల అతడికి ఇలా చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

చివరగా గతేడాది
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ సందర్భంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఆరు టెస్టులు ఆడి మూడు అర్ధ శతకాలు, ఓ సెంచరీ సాయంతో 371 పరుగులు చేశాడు. చివరగా గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సర్ఫరాజ్‌ టీమిండియాకు ఆడాడు.

భారీగా బరువు తగ్గి... 
ఆ తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక చేస్తారని ఆశించిన సర్ఫరాజ్‌ ఖాన్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ క్రమంలో తనకు దొరికిన విరామాన్ని ఈ ముంబై బ్యాటర్‌ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేందుకు ఉపయోగించుకున్నాడు. రెండు నెలల వ్యవధిలో ఏకంగా పదిహేడు కిలోల బరువు తగ్గి గుర్తుపట్టలేనంతగా సన్నబడ్డాడు.

 ఈ క్రమంలో బుచ్చిబాబు ఇన్విటేషనల్‌ టోర్నీ ద్వారా కాంపిటేటివ్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించే ఈ రెడ్‌బాల్‌ టోర్నీలో ముంబై తరఫున సర్ఫరాజ్‌ శతకంతో సత్తా చాటాడు. 114 బంతుల్లో పది బౌండరీలు, ఆరు సిక్సర్ల సాయంతో 138 పరుగులు సాధించాడు. విండీస్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో తనను గుర్తుపెట్టుకోవాలన్నట్లుగా ఇలా బ్యాట్‌తోనే సెలక్టర్లకు సందేశం ఇచ్చాడు.

అంతా తలకిందులు
కానీ గాయం కారణంగా అంతా తలకిందులైంది. తొడ కండరాల నొప్పితో బాధపడిన 27 ఏళ్ల సర్ఫరాజ్‌ ఖాన్‌... దులిప్‌ ట్రోఫీ టోర్నీకి కూడా దూరమయ్యాడు. తాజాగా వెస్టిండీస్‌తో టెస్టులకు కూడా అతడు ఎంపిక కాలేదు. ఇందుకు గల కారణాన్ని టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వెల్లడించాడు. గాయం కారణంగానే అతడు సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడని తెలిపాడు.

కాగా టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబరు 2- 6 తొలి టెస్టు.. ఢిల్లీలో అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

వెస్టిండీస్‌తో టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, నారాయణ్‌ జగదీశన్‌ (వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌.

చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌.. బీసీసీఐ ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement