టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. భారత్‌కు ఈ ఏడాది ప్రపంచకప్ టైటిల్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆ రెండు కారణాల వల్ల..
ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆటగాడిగా తేలిపోవడమే ఇందుకు కారణం. అంతేగాక టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో 35 ఏళ్ల సూర్య వయసు కూడా ఓ అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
పరిశీలనలో మూడు పేర్లు
ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కొత్త కెప్టెన్ విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వరల్డ్‌కప్ వీరుడు సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వెల్లడించాయి.
అయితే, తాజా సమాచారం ప్రకారం.. సంజూ, అక్షర్‌లను కాదని శ్రేయస్ అయ్యర్‌కే సెలక్షన్ కమిటీ ఓటేసినట్లు సమాచారం. ఇందులో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ..
అతడికే ఓటేసిన అగార్కర్
‘‘అజిత్ దృఢచిత్తం గల చీఫ్ సెలక్టర్. స్ట్రాంగెస్ట్ చీఫ్ సెలక్టర్లలో అతడు ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అతడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.
తన ప్యానెల్‌తో కలిసి కొత్త టీ20 కెప్టెన్ కోసం అగార్కర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రేయస్ అయ్యర్‌ను తొలుత వన్డేలకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందే శ్రేయస్ విషయంలో ఒక నిర్ణయమైతే జరిగిపోయింది’’ అని పేర్కొన్నాయి.
గంభీర్ విముఖత!
అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ విషయంలో అగార్కర్‌తో ఏకీభవించడం లేదని సమాచారం. ‘‘గంభీర్ మనసులో ఒకరు ఉండొచ్చు. సెలక్టర్లు వేరొకరి గురించి ఆలోచించవచ్చు. అయితే, అక్షర్ పటేల్ వరల్డ్‌కప్ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయాన్ని మర్చిపోవద్దు.
రేసులో ఇషాన్ కూడా!
ఇక ఇషాన్ కిషన్.. అతడి వయసు చిన్నదే. ఫామ్‌లో ఉన్నాడు. సారథిగానూ నిరూపించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ విషయంలో మాత్రం సెలక్టర్లు సంతృప్తిగా లేరు. అతడి నిలకడలేని ఆట తీరే ఇందుకు కారణం.
కాబట్టి శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్, అక్షర్ కూడా రేసులో ఉన్నారని చెప్పవచ్చు. కానీ సంజూకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత కొత్త టీ20 కెప్టెన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


