
ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ పేసర్లకు చేదు అనుభవం ఎదురైంది. తమ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు చితక్కొడుతుంటే వారి అసహనం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఆటపై దృష్టి పెట్టాల్సింది పోయి .. నోటికి పనిచెప్పారు.
పాక్ జట్టుకు ఓటమిని కానుకగా
తమ బౌలింగ్‌లో ఉతికారేస్తున్న ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishesk Sharma)- శుబ్‌మన్ గిల్ (Shuban Gill)లతో వాదులాటకు దిగేందుకు ప్రయత్నించారు. ఇందుకు వారిద్దరు బ్యాట్‌తోనే సమాధానమిచ్చి.. పాక్ జట్టుకు ఓటమిని కానుకగా అందించారు. దీంతో ఆడలేక అతి చేసిన పాక్ ఆటగాళ్లకు మరోసారి అవమానం తప్పలేదు.
అసలేం జరిగిందంటే.. లీగ్ దశలో టీమిండియా చేతిలో చిత్తైన పాక్ (IND vs PAK).. తాజాగా సూపర్-4 మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. అయితే, బ్యాటింగ్ పరంగా మాత్రం మెరుగ్గా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
ఆది నుంచే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు
అయితే, టీ20 వరల్డ్ నంబర్ వన్ అయిన భారత జట్టు పాక్ విధించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆది నుంచే పాక్ బౌలర్లపై దూకుడు ప్రదర్శించారు. ఇద్దరూ బౌండరీలు బాదుతూ పాక్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.
ఈ క్రమంలో పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్.. అభిషేక్- గిల్‌లను మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. షాహిన్ బౌలింగ్‌లో ఇరగొట్టిన గిల్.. అతడి ఓవరాక్షన్‌కు బదులుగా ‘‘వెళ్లి బంతి తెచ్చుకో’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఇక హ్యారిస్ రవూఫ్ పదే పదే మాటలతో కవ్వింపులకు పాల్పడగా.. అభిషేక్ ఓ దశలో అతడికి దగ్గరగా వెళ్లి బదులిచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో అంపైర్ వచ్చి రవూఫ్‌ను పక్కకు తీసుకువెళ్లాడు.
అస్సలు నచ్చలేదు
ఈ విషయంపై మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. పాక్ బౌలర్లు కారణం లేకుండా మీద మీదకు వచ్చారని.. దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నాడు. తనకు అది అస్సలు నచ్చలేదని తెలిపాడు. తాము మాత్రం అనవసర విషయాల పట్ల కాకుండా ఆటపై మాత్రమే దృష్టి పెట్టామంటూ పాక్ బౌలర్లకు మరోసారి కౌంటర్ ఇచ్చిపడేశాడు.
ఇక గిల్- అభిషేక్ శర్మ సోషల్ మీడియా వేదికగా.. ‘‘మీవి మాటలు- మావి చేతలు’’ అంటూ పాక్‌కు తమ ఓటమిని గుర్తు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఈ ఇద్దరు పంజాబీ ఆటగాళ్లు చిన్ననాటి నుంచి స్నేహితులు. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వీరికి మెంటార్. ఇక తాజా మ్యాచ్‌లో విరాట్ కోహ్లిలేని లోటు పాక్ ఆటగాళ్లకు తెలియకుండా చేశారంటూ గిల్- అభిలపై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!
Ye Naya Bharat Hain. Ye Bekhauf Bharat hai! 💪
Watch the Asia Cup, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/mn3n9OEZjv— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025