ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్‌ ఆటగాళ్లు! | Haris Rauf Faces Criticism Over Provocative Gesture During Ind Vs Pak Match Creates Controversy | Sakshi
Sakshi News home page

ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్‌ ఆటగాళ్లు!

Sep 22 2025 10:42 AM | Updated on Sep 22 2025 11:06 AM

Haris Rauf Faces Criticism Over Provocative Gesture During Ind Vs Pak Match Creates Controversy

టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆటగాళ్లు బరితెగించారు. ఓ బ్యాటర్‌ ఏకే-47 మాదిరి బ్యాట్‌తో సంబరాలు చేసుకుంటే.. ఇంకో ఆటగాడు ఇంకాస్త దిగజారి వ్యవహరించాడు. ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో భారత నెటిజన్లు పాక్‌ ఆటగాళ్లపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఛీ.. మీ బుద్ధి మారదా?
‘‘ఛీ.. మీ బుద్ధి మారదా? ఇంతకంటే ఇంకెంతకు దిగజారుతారు?’’ అంటూ చివాట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్‌-2025 టోర్నీ సూపర్‌-4లో భాగంగా భారత్‌- పాకిస్తాన్‌ (IND vs PAK) ఆదివారం తలపడ్డాయి.

దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసి.. పాక్‌ను 171 పరుగులకు కట్టడిచేసింది. ఆపై 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే.. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (Sahibzada Farhan) టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.

ఏకే-47 గన్‌ ఎక్కుపెట్టినట్లుగా
ఫర్హాన్‌ నలభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 58 పరుగులు సాధించాడు. అయితే, హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగానే ఏకే-47 గన్‌ ఎక్కుపెట్టినట్లుగా అభినయిస్తూ బ్యాట్‌ను చూపిస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

విరాట్‌ కోహ్లి నామస్మరణ
యువ ఆటగాడు ఫర్హాన్‌ సంగతి ఇలా ఉంటే.. సీనియర్‌ ప్లేయర్‌ హ్యారిస్‌ రవూఫ్‌ మరో అడుగు ముందుకు వేశాడు. బౌండరీ రోప్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో భారత దిగ్గజం విరాట్‌ కోహ్లి నామస్మరణ చేస్తూ ప్రేక్షకులు టీమిండియాను ఉత్సాహపరిచారు. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022లో కోహ్లి తన బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాది.. మ్యాచ్‌ను లాగేసుకున్న విషయం అతడికి గుర్తుకు వచ్చినట్లు ఉంది.

ఇదొక దిగజారుడు చర్య
అయితే, ఇందుకు తాజా మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో సమాధానం ఇవ్వాల్సింది పోయి.. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌.. భారత్‌కు చెందిన ఆరు ఫైటర్‌ జైట్లను కూల్చామని ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. హ్యారిస్‌ రవూఫ్‌ సైగలు చేశాడు.

అంతకు ముందు ప్రాక్టీస్‌ సమయంలో ఫుట్‌బాల్‌ ఆడుతూ.. 6-0sతో లీడ్‌లో ఉన్నామంటూ భారత జర్నలిస్టుల ముందు పాక్‌ ఆటగాళ్లు అతి చేశారు. ఈ నేపథ్యంలో ఇదొక దిగజారుడు చర్య అంటూ క్రికెట్‌ ప్రేమికులు పాక్‌ ఆటగాళ్ల తీరును విమర్శిస్తున్నారు. కాగా పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా పాక్‌ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే.

ఆసియా కప్‌ -2025 సూపర్‌ 4: టీమిండియా వర్సెస్‌ పాకిస్తాన్‌
👉పాకిస్తాన్‌ స్కోరు: 171/5 (20)
👉టీమిండియా స్కోరు: 174/4 (18.5)
👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.

చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్‌ జట్టు పరువు తీసిన సూర్య

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement