
నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ (WI vs NEP) క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయీ హోప్‌నకు విశ్రాంతినిచ్చిన విండీస్ బోర్డు.. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ అకీల్ హొసేన్ (Akeal Hosein)కు బాధ్యతలు అప్పగించింది.
కాగా షార్జా వేదికగా వెస్టిండీస్ జట్టు నేపాల్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 27, 28, 30 తేదీల్లో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు గురువారం తమ జట్టును ప్రకటించింది.
ఐదుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
కెప్టెన్ షాయి హోప్ (Shai Hope)తో పాటు పేసర్ అల్జారీ జోసెఫ్, బ్యాటర్ జాన్సన్ చార్లెస్ వంటి కీలక ప్లేయర్లకు కూడా సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అయితే, ఈ సిరీస్‌లో అకీల్ హొసేన్ సారథ్యంలో జేసన్ హోల్డర్, ఫాబియాన్ అలెన్, కైల్ మేయర్స్ వంటి వారు ప్రధాన భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఇక ఏకంగా ఐదుగురు వెస్టిండీస్ ఆటగాళ్లు నేపాల్‌తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటర్ అకీమ్ ఆగస్టీ, ఆల్‌రౌండర్ నవీన్ బిడైసీ, స్పిన్నర్ జీషన్ మొతారా, పేసర్ రామోన్ సైమండ్స్, కీపర్ అమీర్ జాంగూ (టీ20 అరంగేట్రం)లకు తొలిసారి ఈ జట్టులో చోటు దక్కింది.
నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు
అకీల్ హొసేన్ (కెప్టెన్), ఫాబియాన్ అలెన్, జువెల్ ఆండ్రూ, అకీమ్ ఆగస్టీ, నవీన్ బిడైసీ, జెడియా బ్లేడ్, కేసీ కార్టీ, కరీమా గోరె, జేసన్ హోల్డర్, అమీర్ జాంగూ, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, జీషన్ మొతారా, రామోన్ సైమండ్స్, షమార్ స్ప్రింగర్.
ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ తర్వాత.. సీనియర్లతో కూడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా టీమిండియాతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విండీస్ తమ జట్టు వివరాలను వెల్లడించింది.
టీమిండియాతో టెస్టులకు విండీస్ జట్టు వివరాలు
రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), తేజ్ నారాయణ్ చందర్‌పాల్, బ్రెండన్ కింగ్, కెవ్‌లాన్ అండర్సన్, షై హోప్, జాన్ క్యాంప్‌బెల్, అతనాజ్, ఇమ్‌లాక్, గ్రీవ్స్, అండర్సన్ ఫిలిప్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, ఖారీ పైర్, జోమెల్ వారికాన్.