
ఆసియా కప్-2025 టోర్నమెంట్ లీగ్ దశలో పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అతడు డకౌట్ అయ్యాడు. ఒమన్, టీమిండియా, యూఏఈ జట్లతో మ్యాచ్‌లలో పరుగుల ఖాతా తెరవకుండానే 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ వెనుదిరిగాడు.
అయితే, బ్యాటర్‌గా విఫలమైనా.. వికెట్లు తీయడంలో మాత్రం సఫలమయ్యాడు ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్టు బౌలర్ల కంటే అతడే ఓ అడుగు ముందున్నాడు. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్‌లో పాక్ తీసిన మూడు వికెట్లు అతడి ఖాతాలోనే ఉండటం ఇందుకు నిదర్శనం.
ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ (Rashid Latif) సయీమ్ ఆయుబ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఓ వ్యక్తి ఒంటెపై కూర్చుని ఉన్నా కుక్కకాటు నుంచి మాత్రం తప్పించుకోలేడు’’ అని లతీఫ్ పేర్కొన్నాడు.
మేనేజ్‌మెంట్ నుంచి మద్దతు దక్కుతున్నా ఆయుబ్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉందన్న అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ బ్యాటర్ పరుగులు తీయకుండా.. వికెట్లు తీయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.
పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు
‘‘ప్రతి ఒక్కరి కెరీర్‌లో గడ్డు దశ అనేది ఒకటి ఉంటుంది. అతడు వైవిధ్యభరితమైన షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నాడు. బ్యాటర్‌గా కాకుండా.. బౌలింగ్ విభాగంలో రాణిస్తున్నందున అతడికి తుదిజట్టులో చోటు దక్కుతోంది. అయితే, కీలక మ్యాచ్‌లలో మాత్రం అతడు తప్పక పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు’’ అని రషీద్ లతీఫ్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’లో భాగంగా టీమిండియా చేతిలో ఓడిన పాక్.. యూఏఈ, ఒమన్‌లపై గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టుతో కలిసి ఈ గ్రూపు నుంచి సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్- పాక్ జట్ల మధ్య సెప్టెంబరు 21న సూపర్-4 మ్యాచ్ జరుగనుంది.
సూపర్-4 బెర్తు ఖరారు
ఇక లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్‌లను చిత్తుగా ఓడించిన సూర్యకుమార్ సేన.. ముందుగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పాక్‌తో మ్యాచ్ ఆడినప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఈ విషయంపై నానాయాగీ చేసిన పాక్ క్రికెట్ బోర్డు బాయ్‌కాట్ పేరిట డ్రామాకు తెరతీసింది. అయితే, తమ పాచికలు పారకపోవడంతో యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడిన పాక్.. 41 పరుగుల తేడాతో గెలిచి సూపర్-4కు చేరుకుంది.
చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
UAE strike early vs Pakistan 🤯
Watch #PAKvUAE LIVE NOW, on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/gVRGeSYoBv— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025