
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సూపర్-4 దశకు అర్హత సాధించింది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి.. లీగ్ దశను విజయవంతంగా ముగించింది. యూఏఈ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి ఎట్టకేలకు గట్టెక్కిన పాక్.. మరోసారి టీమిండియతో తలపడేందుకు సిద్ధమైంది.
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 21న పాకిస్తాన్.. టీమిండియా (Ind vs Pak)ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో యూఏఈపై విజయానంతరం పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha).. తాము ఏ జట్టునైనా ఓడించగలమంటూ కాస్త అతిగా మాట్లాడాడు. ‘‘మేము ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాము. అయితే, మధ్య ఓవర్లలో ఇంకాస్త శ్రమించాల్సింది.
అబ్రార్ అహ్మద్ అత్యద్భుతం
ఏదైమైనా మా బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ బ్యాటింగ్ పరంగానే మేము నిరాశకు లోనయ్యాం. ఇప్పటి వరకు మా అత్యుత్తమ స్థాయి ప్రదర్శనను కనబరచలేకపోయాం. ఒకవేళ ఈరోజు మేము మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. 170-180 పరుగులు సాధించేవాళ్లం.
షాహిన్ ఆఫ్రిది మ్యాచ్ విన్నర్. అతడి బ్యాటింగ్ కూడా మెరుగుపడింది. ఇక అబ్రార్ అహ్మద్ (2/13) అత్యద్భుతంగా రాణించాడు. చేజారే మ్యాచ్‌లను మావైపు తిప్పడంలో అతడు ఎల్లప్పుడూ ముందే ఉంటాడు.
ఎలాంటి జట్టునైనా ఓడించగలము
మున్ముందు ఎదురయ్యే ఎలాంటి సవాలుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇలాగే గొప్పగా ఆడితే.. ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. పరోక్షంగా టీమిండియాను ఉద్దేశించి.. తాము సూపర్-4 పోరుకు సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశాడు.
నాటకీయ పరిణామాల నడుమ
కాగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడ్డాయి. ఈ క్రమంలో యూఏఈ, పాక్‌లను ఓడించి టీమిండియా తొలుత సూపర్ ఫోర్‌కు అర్హత సాధించగా.. ఒమన్ ఎలిమినేట్ అయింది. అయితే, గ్రూప్-ఎ నుంచి మరో బెర్తు కోసం పాక్- యూఏఈ బుధవారం రాత్రి తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలిచి.. తమ బెర్తును ఖరారు చేసుకోగా.. యూఏఈ ఎలిమినేట్ అయింది.
ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోని భారత జట్టు.. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కరచాలనానికి నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది.
దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు తాము బాయ్‌కాట్ చేస్తామంటూ రచ్చచేసింది. అయితే, ఆఖరికి పాక్ తలొగ్గక తప్పలేదు. యూఏఈతో మ్యాచ్‌కు గంట కావాలనే ఆలస్యం చేసినా.. చివరకు మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది.
పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ స్కోర్లు
టాస్: యూఏఈ.. తొలుత బౌలింగ్
పాక్ స్కోరు: 146/9 (20)
యూఏఈ స్కోరు: (17.4)
ఫలితం: యూఏఈపై 41 పరుగుల తేడాతో పాక్ గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాహిన్ ఆఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్.. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు).
చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే!