● నిత్యం ఎగువ మా‘నీటి’ వృథా ● జలాశయంలో తగ్గుతున్న నీటి మట్టం ● నిధులున్నా.. మరమ్మతులు కరువు
గంభీరావుపేట(సిరిసిల్ల): సిరిసిల్ల మెట్ట ప్రాంత వరప్రదాయినీ నర్మాల ఎగువమానేరుకు లీకేజీల బెడద తప్పడం లేదు. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ షట్టర్ల లీకేజీలతో సాగునీరు బయటకు వెళ్తోంది. అయినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాది పొడవునా జలాశయంలోని నీరు ఇలా కాలువ ద్వారా వృథాగా పోతున్న మరమ్మతు చేయాలన్న ఆలోచన రావడం లేదు. షట్టర్ల మరమ్మతుల కోసం ఏడాది క్రితం దాదాపు రూ.20లక్షలు మంజూరయ్యాయి. అయినా సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదు. వానాకాలం వచ్చినా.. ఎగువన వర్షాలు లేకపోవడంతో జలాశయంలో రోజురోజుకు నీటి మట్టం తగ్గిపోతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా.. ఇప్పుడు 13 అడుగుల నీరు మాత్రమే ఉంది. వానలు లేకపోతే ఈసారి ఆయకట్టుకు సాగునీరు అందుతుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీటినైనా సంరక్షించుకునే ప్రయత్నాలు అధికారులు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎడమ ప్రధానకాలువ షట్టర్ల వద్ద చుక్క నీరు లేదు. కుడి కాలువ వద్ద నీరున్నా వృథా కిందికి వెళ్లిపోతుంది.
నిధులున్నా.. పనులు సున్నా..
ఎగువమానేరు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ షట్టర్ల మరమ్మతులకు రూ.20లక్షలు మంజూరై ఏడాది గడుస్తోంది. కానీ పనుల జాడ లేదు. పనులు చేయడానికి నీరు అడ్డంకిగా మారిందని కాంట్రాక్టర్, అధికారులు పేర్కొంటున్నారు. నీటికి అడ్డుకట్ట వేసి పనులు చేయవచ్చునని రైతులు అంటున్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిత్యం రెండు, మూడు మోటార్ల నీరు కిందికి వెళ్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు.
మరమ్మతు చేపడతాం
కుడి కాలువ ప్రధాన షట్టర్ల మరమ్మతులకు రూ.20లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ పనులు చేయడంలో జాప్యం చేస్తున్నారు. మరమ్మతులు చేయడానికి నీటిని నిలిపేందుకు అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా మరమ్మతులు చేసి నీటి వృథాను నియంత్రిస్తాం.
– నర్సింగ్, ఇరిగేషన్ డీఈ


