నిబంధనలకు విరుద్ధంగా..
రోడ్డుపై దుమ్ము, ధూళి చేరిన మాంసం విక్రయాలు
అధికారుల పట్టింపు కరువు
వేములవాడరూరల్: అసలే వర్షాకాలం.. వ్యాధుల కాలం. వేములవాడ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా, రోడ్డు పక్కన దుమ్ము, ధూళిలో మటన్ విక్రయాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారుల చర్యలు శూన్యం. పట్టణంలో ఆలయం నుంచి బ్రిడ్జి వరకు ప్రధాన రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు మటన్ విక్రయాలు జరుపుతున్నారు. వీటిపై దుమ్ము, ధూళి చేరుతోంది. వానకాలం కావడంతో ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అయినా సంబంధిత అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.
తూనికలు, కొలతల అధికారులు ఎక్కడ..?
మటన్, చికెన్ వ్యాపారులు అధిక ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసిన మటన్, చికెన్ తూకంలో తేడాలు వస్తున్నట్లు, తూనికలు, కొలతల అధికారులు తనిఖీ చేసిన దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిలో ఒకసారి చుట్టపుచూపుగా కొన్ని దుకాణాలకు తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కాగితాల్లోనే స్లాటర్ హౌస్
మటన్ వ్యాపారులు జీవాలను వధించేందుకు మున్సిపల్ తరుఫున స్లాటర్ హౌజ్ ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ అధికారి ముందుగా జీవాలను పరిశీలించి ఆరోగ్యంగా ఉంటేనే వాటిపై ముద్ర వేసి వ్యాపారులకు అప్పగిస్తారు. కానీ, పట్టణంలో 50కి పైగా మటన్ దుకాణాలు ఉండగా, స్లాటర్‌హౌజ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ఇళకల వద్దే వ్యాపారులు జీవాలను వధించి రోడ్లపై విక్రయిస్తున్నారు. జీవాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అనే విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.


