ప్రజాపంపిణీ స్వరూపం
● లబ్ధిదారుల ఈ–కేవైసీ నమోదు ● ఈ నెలాఖరు వరకు గడువు ● ఇప్పటికే 81 శాతం పూర్తి
సిరిసిల్ల: ప్రజాపంపిణీలో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సాంకేతికంగా కట్టడి చేస్తోంది. రేషన్‌కార్డులపై సన్నబియ్యం అందిస్తుండడంతో అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారులకే చేరేలా ముందుకు సాగుతోంది. ఇందుకోసం రేషన్‌కార్డుదారుడు విధిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) నమోదు చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. జూలై నెలఖరులోగా ప్రతీ రేషన్‌కార్డుదారుడు స్థానికంగా ఉన్న రేషన్‌షాపుల్లో వేలిముద్రలు వేసి ఈ–కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా చనిపోయినా.. కార్డుదారులు స్థానికంగా లేకపోయినా.. సరుకులు పొందకుండా ఈ–కేవైసీ ద్వారా నియంత్రిస్తున్నారు. రేషన్‌కార్డులో పేర్లు ఉన్న విధిగా వేలిముద్ర వేయాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా రేషన్‌షాపులను ఇప్పుడు తెరిచి ఉంచారు. రేషన్‌కార్డుదారులు ఆ షాపుల్లోకి వెళ్లి ఈ–కేవైసీ నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 81 శాతం ఈ–కేవైసీ పూర్తయింది.
ఆగస్టులో మూడు నెలల బియ్యం పంపిణీకి ఏర్పాట్లు
ఆగస్టులో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాలని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఈ–కేవైసీ పూర్తయితే వచ్చిన డే టా ఆధారంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెల ల బియ్యాన్ని అందించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఈనెల 25 వరకు స్పష్టత రానుంది. వర్షాకాలంలో ఇబ్బందులు రానీయకుండా ఉండేందుకు మూ డు నెలల రేషన్‌బియ్యం ఒకేసారి గతంలో లాగే ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వం రేషన్‌షాపుల్లో సన్నబియ్యం అందించడంతో రేషన్‌కార్డులు ఉన్న అందరూ ఆసక్తిగా బియ్యం తీసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డులోని ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఈ–కేవైసీ పూర్తికాగానే ఒక్క నెల బియ్యం ఇస్తారా? మూడు నెలలది ఇస్తారా? అనేది తేలుతుందని అధికారులు భావిస్తున్నారు.
గ్రామాలు: 260, రేషన్ షాపులు: 345
రేషన్‌కార్డులు : 1,96,092
అంత్యోదయ కార్డులు: 13,830
ప్రతీ నెల సరఫరా అయ్యే బియ్యం:
3,965 టన్నులు
ప్రతీ నెల బియ్యం పొందే వారు : 5,55,920


