కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలోని రహదారులపై భారీ వాహనాలను పార్కింగ్ చేయొద్దని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత చర్యలపై అధికారులతో సమీక్షించారు. జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ జాతీయ రహదారుల వెంట గుర్తించిన బ్లాక్ స్పాట్స్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై ఆరా తీశారు. జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఆర్‌అండ్‌బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఎస్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ మొగిలి, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
80 శాతం డిజిటలైజేషన్ పూర్తి
జిల్లాలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 80 శాతం పూర్తి అయిందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు తమ పరిధిలో పర్యవేక్షణ చేయాలని, రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా మీటింగ్‌లు పెట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.


