తంగళ్లపల్లిలో స్వయం ఉపాధి యూనిట్లు కోల్డ్ ప్రెస్ ఆయిల్, మిల్క్‌పార్లర్లతో మహిళల ముందడుగు పారిశ్రామికవేత్తలుగా అతివలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా అడుగులు వేస్తున్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రం స్థానిక మహిళా సంఘాల సహకారంతో, ప్రభుత్వం మంజూరు చేసిన రుణంతో ‘కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్’(స్వచ్ఛమైన గానుగ నూనె కేంద్రం) ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే తాము వ్యాపారవేత్తలుగా రాణించేందుకు ముందడుగు వేశారు.
మహిళా సంఘాల ద్వారా రుణం
మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఈ యూనిట్ స్థాపనకు పునాది వేసింది. ఇందిరా మహిళాశక్తి పథకం కింద తంగళ్లపల్లికి చెందిన మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణం మంజూరైంది. ఈ నిధులతో అధునాతన సాంకేతికతతో కూడిన కోల్డ్ ప్రెస్ ఆయిల్(గానుగ) యంత్రాలను కొనుగోలు చేశారు. మహిళలంతా ఒక సమూహంగా ఏర్పడి, పక్కా ప్రణాళికతో ఈ యూనిట్‌ను లాభదాయకమైన ఉపాధిమార్గంగా మార్చుకున్నారు.
ఉపాధి.. ఆరోగ్యం
ప్రస్తుత మార్కెట్లో లభించే కెమికల్స్ కలిసిన రీఫైండ్ నూనెలతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. దీన్ని గమనించిన తంగళ్లపల్లి మహిళా సంఘం సభ్యులు స్వచ్ఛమైన గానుగ నూనెను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కోల్డ్ ప్రెస్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా వేరుశనగ, నువ్వులు, కుసుమలు, కొబ్బరి నుంచి ఎలాంటి రసాయనాలు కలపకుండా, తక్కువ ఉష్ణోగ్రత వద్ద నూనెను సేకరిస్తారు. ఈ నూనె వినియోగించడం ద్వారా గుండెజబ్బుల ముప్పు తగ్గడమే కాకుండా, శరీర రోగ నిరోధకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ యూనిట్‌ను విస్తరించి.. మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని గ్రూప్ సభ్యులు చెబుతున్నారు.
కలెక్టర్ అభినందనలు
ఈ కోల్డ్‌ప్రెస్ ఆయిల్ యూనిట్‌ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రారంభించిన సందర్భంగా మహిళల నిర్ణయాన్ని అభినందించారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబంతోపాటు సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.


