వెబ్‌ కాస్టింగ్‌ హైజాక్‌! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్‌ బటన్ | Web Casting Hijack On And Off Button In Chandrababu Naidu Hand, More Details Inside | Sakshi
Sakshi News home page

వెబ్‌ కాస్టింగ్‌ హైజాక్‌! చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్‌ బటన్

Published Sat, May 25 2024 4:16 AM

Web Casting Hijack On and off button in Chandrababu hand

చంద్రబాబు చేతిలో ఆన్, ఆఫ్‌ బటన్లు 

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలు

ప్రైవేట్‌ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు 

ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చినబాబు చేతికి 

విదేశాల నుంచి వీడియోలు పోస్ట్‌ చేసిన లోకేష్‌.. దర్యాప్తు దశలో బయటకు వెళ్లి ఉండవచ్చంటూ ఈసీ బాధ్యతారాహిత్యం 

అధికార యంత్రాంగంపై ఇప్పుడు అజమాయిషీ ఈసీదే కదా?.. కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా? 

ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్నా నిర్లిప్తత.. ఆకస్మికంగా అధికారుల బదిలీ.. టీడీపీ బ్యాచ్‌కు పోస్టింగులు 

చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు 

ఎమ్మెల్యే పిన్నెల్లిపై తాజాగా మరో అక్రమ కేసు 

కౌంటింగ్‌ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాల యత్నాలు

సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్‌ చేసినట్లు తేటతెల్లం కావడం నివ్వెరపరుస్తోంది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్‌ (ఈసీ) పూర్తి ‘పచ్చ’పాతంతో పావుగా మారినట్లు వెల్లడవుతోంది. ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండాల్సిన వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం, వీడియోలు టీడీపీ నేతలకు చేరిపోవడం దీన్ని నిర్థారిస్తోంది. విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్‌ పోలింగ్‌ బూత్‌ వీడియోలను ఎడిట్‌ చేసి విడుదల చేయడం ఏమిటి? ఏ అధికారి ద్వారా అవి లోకేష్‌కు చేరిపోయాయి? అనే ప్రశ్నలకు ఈసీ సూటిగా జవాబు చెప్పకుండా దాటవేత వైఖరి అనుసరించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 

వాటిని తాము విడుదల చేయలేదని, దర్యాప్తు సమయంలో అవి బయటకు వెళ్లిపోయి ఉండవచ్చంటూ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య వాదులను నిర్ఘాంతపరుస్తోంది. నిష్పాక్షికంగా వ్యవహరించడం అంటే ఇలాగేనా? అని విస్తుపోతున్నారు. గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితోపాటు పోలింగ్‌ రోజు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్‌.శివశంకర్, ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌ నుంచి క్షేత్రస్థాయిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల వరకూ అందరూ టీడీపీ అక్రమాలకు అండగా నిలిచినా ఈసీ ప్రేక్షక పాత్ర వహించింది. ఇదే అదునుగా పచ్చముఠాలు ఎన్నికల వేళ భయానక వాతావరణాన్ని సృష్టించాయి. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు వైఎస్సార్‌ సీపీకి అండగా నిలవటాన్ని చూసి సహించలేక ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్దకు రాకుండా భయభ్రాంతులకు గురి చేశాయి. ఇంత చేసినా గెలవలేమనే నిస్పృహతో అలజడులు సృష్టిస్తూ ఓట్ల లెక్కింపు రోజు మరోసారి విధ్వంసాలకు తెగబడేలా పథకాన్ని రూపొందించాయి. పోలింగ్‌ రోజు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరిస్తున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల నిర్వహణను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థకు అప్రతిష్ట వాటిల్లేలా వ్యవహరిస్తున్న  ఈసీ వివాదాస్పద వైఖరిపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది.  

వెబ్‌ కాస్టింగ్‌పై ‘పచ్చ ముఠా’ పెత్తనం 
ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహణకు అత్యంత కీలకమైన వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియను చంద్రబాబు ముఠా హైజాక్‌ చేయడం విస్మయం  కలిగిస్తోంది. వెబ్‌ కాస్టింగ్‌పై ఈసీకి నియంత్రణ లేదా? ఉద్దేశపూర్వకంగానే టీడీపీ వర్గీయులైన ప్రైవేట్‌ వ్యక్తులకు అందుబాటులోకి తెచి్చందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని 46,389 ఎన్నికల కేంద్రాలకుగానూ 31,380 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను రికార్డ్‌ చేశారు. అత్యంత సమస్యాత్మక 14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో లోపల, బయట వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రికార్డ్‌ జరిగింది. 

ఇందులో పల్నాడు జిల్లాకు చెందిన మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాలతోపాటు ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లి, రాయచోటి, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాలున్నాయి. ఇలాంటి వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థను చంద్రబాబు ముఠా తమ గుప్పిట్లోకి తీసుకుంది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ వీడియో రికార్డింగ్‌ అంటూ నారా లోకేష్‌ తన ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో పోస్టు చేయడం అందుకు నిదర్శనం. తాము ఆ వీడియోను విడుదల చేయలేదని ఈసీ చెబుతోంది. 

అలాంటప్పుడు ఎలా లీక్‌ అయింది? వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు పొక్కడం ఈసీ నిబద్ధతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. నిబంధనల ప్రకారం వెబ్‌ కాస్టింగ్‌ పూర్తిగా ఈసీ నియంత్రణలో ఉంటుంది. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రికార్డ్‌ అయ్యే వీడియోలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు సంపూర్ణ నియంత్రణ ఉంటుంది. వెబ్‌కాస్టింగ్‌ లింక్‌ ను జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లలో అందుబాటులో ఉంచారు. వాటిని కలెక్టర్‌తోపాటు ఐజీ, ఎస్పీ పరిశీలిస్తారు. వెబ్‌కాస్టింగ్‌ రికార్డింగ్‌ కోసం ప్రైవేట్‌  ఏజెన్సీలను వినియోగించారు. పోలింగ్‌ తరువాత వెబ్‌ కాస్టింగ్‌ హార్డ్‌ కాపీని ప్రైవేట్‌ ఏజెన్సీ కలెక్టర్‌కు అందచేస్తుంది. ప్రైవేట్‌ ఏజెన్సీ ఉద్యోగుల ముసుగులో టీడీపీ వర్గీయులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోకి చొరబడ్డారు.    

‘స్వామి’ భక్తి... 7 ఈవీఎంలు ధ్వంసం 
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఈసీ పల్నాడులో క్షేత్రస్థాయిలో పట్టు, అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఎన్నికల ముందు ఆకస్మికంగా బదిలీ చేసింది. గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని పోలింగ్‌కు ముందు చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో బదిలీ చేయడం గమనార్హం. అంతేకాకుండా చంద్రబాబు సూచనల మేరకు పురందేశ్వరి సమరి్పంచిన జాబితా ప్రకారం గుంటూరు రేంజ్‌ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్‌ను నియమించారు. 

రాజకీయ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందనే సంకేతాలతో పల్నాడు కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ కూడా టీడీపీ గుప్పిట్లోకి వెళ్లిపోయినట్లు తదనంతర పరిణామాలు నిర్ధారించాయి. గురజాల డీఎస్పీ పల్లపురాజు, మాచర్ల సీఐ శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, ఎస్సై ఎం.రామాంజనేయులను బదిలీ చేసి వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని నియమించేలా ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌ ద్వారా టీడీపీ కథ నడిపింది. అత్యంత వివాదాస్పదుడైన నారాయణస్వామిని కారంపూడి సీఐగా నియమించడమే అందుకు నిదర్శనం. టీడీపీ రౌడీమూకలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నా, పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకుండా నారాయణ స్వామి ప్రేక్షక పాత్ర పోషించారు. 

అదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం దాడులతో విరుచుకుపడ్డారు. సీఐ నారాయణ స్వామి పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను టీడీపీ గూండాలు ధ్వంసం చేయడం గమనార్హం. ఆయన పరిధిలోనే పాల్వాయి గేటు కూడా ఉంది. పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు బాధ్యులుగా పేర్కొంటూ కొందరు పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేయగా సీఐ నారాయణస్వామి పరిధిలో ఏడు ఈవీఎంలు ధ్వంసమైనా ఆయనపై చర్యలు తీసుకోకుండా ఐజీ త్రిపాఠి అండగా నిలిచారు. కౌంటింగ్‌ రోజు టీడీపీ దౌర్జన్యాలకు కొమ్ము కాసేందుకే ఆయన్ను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.  

పిన్నెల్లిపై కుట్రపూరిత కేసు.. 
ఐజీ త్రిపాఠి ఆదేశాలతో సీఐ నారాయణ స్వామి పూర్తిగా చంద్రబాబు సేవలో తరిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా గురువారం రాత్రి కేసు నమోదు చేయడమే అందుకు తార్కాణం. పిన్నెల్లిపై జూన్‌ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించగా అప్పటికప్పుడు మరో తప్పుడు కేసు నమోదు చేయడం నారాయణ స్వామి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. పది రోజుల క్రితం ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో పిన్నెల్లి సోదరులను తాజాగా నిందితులుగా చేర్చడం గమనార్హం.  

పల్నాడులో పచ్చ ముఠాలు 
పల్నాడు జిల్లా పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 23 గంటల రికార్డింగ్‌లో ఎడిట్‌ చేసిన రెండు నిమిషాల వీడియో క్లిప్‌ మాత్రమే విడుదల కావడం వెనుక పచ్చ కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. పోలింగ్‌కు ముందు చంద్రబాబు ఒత్తిడితో ఈసీ నియమించిన గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌తోపాటు పల్నాడు కలెక్టర్‌గా ఉన్న ఎల్‌.శివశంకర్‌ ఈ పన్నాగంలో పాత్రధారులుగా మారారని వెల్లడవుతోంది. 

పల్నాడు జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ నుంచే వెబ్‌ కాస్టింగ్‌ రికార్డింగ్‌ను పెన్‌ డ్రైవ్‌లో కాపీ చేసి లీక్‌ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ రౌడీమూకలు ఈవీఎంలను ధ్వంసం చేస్తే అవి ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నట్లు చెబుతున్న వీడియో మాత్రమే లీక్‌ కావడం వెనుక చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరించే అధికారులు కీలక పాత్ర పోషించినట్లు తేలుతోంది. మరి దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది?  

పవన్, బాలయ్య ప్రత్యేకమా?
పోలింగ్‌కు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ.. టీడీపీ, జనసేన అగ్రనేతలు యథేచ్ఛగా వ్యవహరించినా చోద్యం చూసింది. నిబంధనల ప్రకారం ఓటర్లు, పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే పోలింగ్‌ బూత్‌లోకి అనుమతిస్తారు. ఓటు హక్కులేని వారు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లకూడదు. ఈ నిబంధన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సతీమణికి వర్తించదని ఈసీ భావించినట్టుంది. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నంబరు 197లో పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

అయితే ఓటు హక్కులేని తన భార్య అన్నా లెజినోవాతో సహా ఆయన పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. దర్జాగా ఫొటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చారు. దీనిపై ఈసీ కనీసం స్పందించలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీ జెండాలు, కండువాలు, కరపత్రాలు ప్రదర్శించకూడదు. హిందూపురంలో టీడీపీ అభ్యర్ధి నందమూరి బాలకృష్ణ మాత్రం మెడలో పార్టీ కండువా ధరించి వెళ్లి మరీ ఓటు వేశారు. ఆ ఫొటోలు, వీడియోలు మీడియాలో వచ్చినా ఈసీ           నోరు   మెదపలేదు.  

Advertisement
 
Advertisement
 
Advertisement