క్యాష్ చేసుకునేందుకు కూటమి నేతల యత్నాలు
కోడిపందేలపై ప్రజాప్రతినిధుల ఫోకస్
డబ్బు కొట్టు.. బరి పట్టు అంటున్న నేతలు
రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్లకు కసరత్తు
సాక్షి, రాజమహేంద్రవరం: సంక్రాంతికి ముందే కూటమి నేతలు బరి తెగిస్తున్నారా? కోడిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారా? కోడిపందేల కంటే బరులకే ప్రాధాన్యం ఇస్తున్నారా? ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారా? బరి స్థాయిని బట్టి ధర నిర్ణయించేశారా? వసూళ్లకు ప్రణాళికలు రూపొందించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సంక్రాంతి కోడిపందేలపై కూటమి ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. బరులు ఏర్పాటు చేయాలంటే తమ చేయి తడపాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. సంక్రాంతికి ఇంకా సమయం ఉన్నా.. వసూళ్లపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాటాలపై క్లారిటీ
సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కోడిపందేల బరులపై చంద్రబాబు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. బరుల కోసం వేలం పాటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒక్కో బరికి ఇంత ధర అని నిర్ణయించి మరీ వసూళ్లకు తెర తీస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బరి స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తం ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తోంది. ఎవరు బరి ఏర్పాటు చేసుకోవాలి, ఎవరికి అనుమతి ఇవ్వాలి, ఎవరి వాటా ఎంత అన్న వ్యవహారం మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, పోలీసులు ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది.
కూటమి నేతల ప్రణాళికలు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో జరిగిన సంక్రాంతి పండగకు కూటమి నేతలు భారీగా రంగంలోకి దిగారు. ప్రతి గ్రామంలో బరి ఉండేలా చక్రం తిప్పారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోపాలపురం, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు తదితర నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీకి ఒకటి, రెండు చొప్పున కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంతకుమించి కోడిపందేల బరులు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది.
టీడీపీ, జనసేన మధ్య పోటీ
కోండిపందేల బరుల ఏర్పాటుపై టీడీపీ, జనసే నేతలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తామే బరులు ఏర్పాటు చేయాలని ఓ వర్గం, కూటమిలో తామూ భాగమని, తమకూ బరులు కావాలని మరో వర్గం నేతలు పోటీపడుతున్నట్లు తెలిసింది. తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబడుతున్నారు. పోటీ అధికంగా ఉండటంతో బరులకు వేలం పాటలు నిర్వహించాలని ప్రజాప్రతినిధులు నిర్ణయించినట్టు సమాచారం. ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికే బరి దక్కేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
పేకాట, గుండాటపై దృష్టి
బరుల ఏర్పాటుకు పోటీ పెరుగుతుండటంతో కొందరు కూటమి నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తున్నారు. కోడిపందేల ముసుగులో సాగే గుండాటలు, పేకాట, బొమ్మ, బొరుసు వంటి వాటిని జోరుగా నిర్వహించి సందట్లో సడేమియా అన్నట్లు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
రూ.కోట్లలో పందేలు
గోదావరి జిల్లాలో రూ.వందల నుంచి రూ.కోట్లలో కోడిపందేలు జరుగుతుంటాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు బుల్లెట్లు, బైకులు బహుమతులుగా పెడుతున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురుతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటారు.
సంక్రాంతంటే గోదావరి జిల్లాలే..
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. ప్రబల తీర్థం, ఎడ్లబండి పోటీలు, గుర్రపు పోటీలు ఇలా ఎన్ని నిర్వహించినా.. కోడిపందేలు లేనిదే పండగ సందడి ఉండదు. ఇందులో భాగంగానే ఎవరు ఏమన్నా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఆంక్షలు పెట్టినా.. కోడిపందేలు ఆడి తీరుతారు. దేశ, విదేశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో గోదావరి జిల్లాలకు వస్తుంటారు. సంక్రాంతి పండగకు కుటుంబ సమేతంగా సొంతూళ్లకు వచ్చేస్తారు. కుటుంబమంతా సరదాగా గడిపేందుకే గోదావరి జిల్లాల బాట పడుతుంటారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రజాప్రతినిధులు, పోలీసులు, కోడిపందేల పేరుతో క్యాష్ చేసుకుంటున్నారు. సరదాగా, సంప్రదాయబద్ధంగా జరగాల్సిన కోడిపందేలు డబ్బులే ప్రామాణికంగా జరుగుతున్నాయి. రూ.కోట్లల్లో పందేలు వేస్తున్నారు. సరదాగా చూసేందుకు వచ్చిన వారు సైతం అందులో పాల్గొని తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
వేలం పాటల ద్వారా కేటాయింపు
కోడి పందేలు నిర్వహించే బరులను వేలం పాటల ద్వారా కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వేలం ద్వారా వచ్చే సొమ్మును ఎవరు ఎంత పంచుకోవాలన్న విషయమై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. రూ.20 లక్షల రూపాయల బరిలో ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు, పోలీస్ స్టేషన్‌కు రూ.2 లక్షలు, మిగిలిన సొమ్మును స్థానిక కూటమి నేతలు పంచుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రూ.10 లక్షల బరిలో కూడా ఇదే తరహాలో అందరూ సమానంగా పంచుకోవాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు పెట్టామని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవాలన్న తలంపుతో అందివచ్చిన ఏ అవకాశాన్ని కూటమి నేతలు వదలడం లేదు. వేలంపాట డబ్బు తమకు వదిలేయాలని గతేడాది పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను కోరారు. ఈసారి కూడా అదే పంథా అవలంబించాలని అనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


