విశాఖలో మీడియాతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ తదితరులు
రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం
దీంతో చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బట్టబయలు
బాబు సర్కార్‌తో రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు, కార్మిక వర్గాలకు తీవ్ర ఇబ్బందులు
ఎంవీపీ కాలనీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గంగలో కలిపే తీరును మరోసారి బట్టబయలు చేశాయని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బొత్స విలేకరులతో మాట్లాడుతూ, ‘చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసిమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించినట్లు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తన స్వార్థం కోసం ఎలా తాకట్టుపెడుతున్నారో స్పష్టమవుతోంది. పైగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అబద్ధమంటూ ఏపీ ప్రభుత్వం లేఖ విడుదల చేయడం సిగ్గుచేటు. సూపర్ సిక్స్ హామీలు కొండెక్కడంతో రాష్ట్రంలో ప్రజా సంక్షేమం సంక్షోభంలో పడింది. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు పడుతున్న కష్టాలే ఇందుకు నిదర్శనం’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ చొరవతోనే వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం
సీఎంగా వైఎస్ జగన్ చొరవలు, విజ్ఞప్తి ప్రకారమే భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను జీఎంఆర్ సంస్థ వేగంగా పూర్తిచేసిందన్నారు. ఇందుకు ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. ‘ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. శంకుస్థాపన సమయంలో తొలుత 2026 డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేస్తామని జీఎంఆర్ ప్రకటించారు. అయితే అప్పటి సీఎం జగన్ కలుగజేసుకుని మరింత త్వరగా పనులు పూర్తిచేయ్యాలని విజ్ఞప్తి చేశారు. దానికి జీఎంఆర్ అంగీకారం తెలిపింది. ఎయిర్‌పోర్టు పనులు పూర్తిచేయించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు’ అని బొత్స వివరించారు. సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మేల్యే ధర్మశ్రీ, విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది?: ప్రభుత్వానికి బొత్స సూటి ప్రశ్నలు
⇒ భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం తానే పూర్తిచేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్న బాబు ప్రభుత్వం గంగవరం ఎయిర్‌పోర్ట్ ఆధునీకరణ పనులను ఎందుకు చేయించలేకపోతోంది?
⇒ భోగాపురం ఎయిర్‌పోర్ట్–విశాఖ సిటీ మధ్య కనెక్టివిటీ పనులు ఎందుకు వేగంగా జరగడంలేదు? పోర్ట్ టు ఎయిర్‌పోర్ట్ పేరుతో జగన్ ప్రభుత్వం బీచ్‌రోడ్డు అభివృద్ధికి ప్రణాళికలు వేసింది. ఆ డీపీఆర్‌కు కేంద్రమంత్రి నితిన్‌గడ్కారీ ఆమోదం తెలిపారు. అయినా ఆ పనులను ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు చేపట్టలేకపోయింది?
⇒ కనీస సమాచారం ఇవ్వకుండా విదేశాలకెళ్లిన సీఎం దేశ చరిత్రలో చంద్రబాబు మినహా మరెవ్వరూలేరు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన రహస్య పర్యటనకు కారణమేమిటి?
⇒ జగన్ జన్మదినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్న పార్టీ కార్యకర్తలపై ‘జంతుబలి’ అంటూ కేసులు పెట్టి రోడ్డుపై నడిపించి చిత్రహింసలు పెట్టిన పోలీసు యంత్రాంగం, గతంలో బాలకృష్ణ సినిమా రిలీజ్ పోస్టర్ల ఎదుట ఇదే తీరుగా వ్యవహరించిన వారిని ఎందుకు పట్టించుకోలేదు?


