స్వప్రయోజనాల కోసమే ‘రాయలసీమ ఎత్తిపోతల’కు మంగళం
శాసనసభ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నోట వాస్తవాలు
తన వ్యాఖ్యలపై నిజనిర్ధారణకూ సిద్ధమన్న రేవంత్
చంద్రబాబు తప్పునకు నిష్కృతి లేదు
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా... సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలతో చంద్రబాబు ద్రోహం బయటపడిందని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం స్వప్రయోజనాల కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు మంగళం పాడారని మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు.
చంద్రబాబు తప్పునకు నిష్కృతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు లేవన్న సాకుతో చంద్రబాబే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ నిలిపివేశారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ ఏపీకి నీటిగండమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో బాబు విఫలమయ్యారని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమను ఎడారిగా మార్చే కుట్రకు పాల్పడవద్దని హెచ్చరించారు.
రాయలసీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
‘రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు తొలి నుంచీ వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్, లా యూనివర్సిటీ, హైకోర్టులను అమరావతికి తరలించుకుపోయారు. సీమ ప్రయోజనాల కోసం ఈ ప్రాంత నాయకులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలి. వైఎస్ జగన్ ఏపీ ప్రయోజనాల కోసం తాపత్రయపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ఆయనతో మాట్లాడి ప్రాజెక్టును నిలుపుదల చేయించినట్టు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తన మాటలపై నిజనిర్ధారణకు అన్ని పార్టీల నుంచి నాయకులను పంపిస్తానని కూడా సవాల్ చేశారు. చంద్రబాబు చేసిన ఈ ద్రోహంపై రాయలసీమ ప్రాంతంతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పునకు బాధ్యత వహించి రాయలసీమ ప్రాజెక్టును చంద్రబాబు తక్షణం పూర్తి చేయాలి. లేకుంటే వదిలే ప్రసక్తే లేదు’ గడికోట హెచ్చరించారు.
బాబును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపం
‘చంద్రబాబును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు. ఏపీకి బాబు సీఎం అయిన ప్రతిసారీ నీటి గండం తలెత్తుతోంది. పైనున్న రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాయి. గతంలో కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు మౌనం వహించారు. ఇప్పుడు మళ్లీ ఎత్తు పెంచుతున్నా పట్టించుకోవడం లేదు. నీటి కేటాయింపుల కోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఏపీ తరఫున వాదనలు వినిపించడంలోనూ బాబు విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూనే ఉన్నారు. అందుకే బాబును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.
ఆంధ్రా తెలంగాణ రెండు ప్రాంతాలకు మంచి జరగాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆలోచించింది. తెలంగాణ నాయకులు కూడా రాయలసీమ ప్రాంత ప్రజల గురించి ఆలోచించాలి. కమీషన్ల కోసం కక్కుర్తి పడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తే, వైఎస్ జగన్ సీఎం అయ్యాకనే కేంద్రంతో మాట్లాడి మళ్లీ గాడినపెట్టారు. నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. రాయలసీమ ప్రాజెక్టును వ్యూహాత్మకంగా పక్కనపెట్టి బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచి్చన చంద్రబాబు, కొన్ని రోజులు హడావుడి చేసి దాన్ని కూడా అటకెక్కించారు’ అని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.


