రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయడంపై మండిపడుతున్న రాష్ట్రం
సీఎం చంద్రబాబు చేసిన అన్యాయంపై ఘోషిస్తున్న సీమ రైతాంగం
తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెడతారా? అంటూ బాబుపై రైతుల ఆగ్రహం
అధికారంలోకి రాగానే ఏపీ హక్కులను పరిరక్షిస్తూ సీమ ఎత్తిపోతలను చేపట్టిన నాటి సీఎం వైఎస్ జగన్
జగన్‌కు మంచి పేరొస్తుందనే అసూయతో సీమ ఎత్తిపోతలపై చంద్రబాబు అక్కసు
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులకూ చంద్ర గ్రహణం!
రాజోలి, జోలదరాసి రిజర్వాయర్లు.. కుందూ ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి ఎత్తని బాబు సర్కార్
ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు నీళ్లు వదిలిన చంద్రబాబు
విద్యుత్ పేరుతో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ ఖాళీ చేస్తున్నా నోరు మెదపని వైనం..
2014–19 మధ్య నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడినా చలించని చంద్రబాబు
ఇపుడు మళ్లీ అదే పరిస్థితి దాపురిస్తుండడంతో రైతుల్లో ఆందోళన
బాబుతీరును తీవ్రంగా ఖండిస్తున్న ప్రజాస్వామిక వాదులు, సాగునీటి రంగ నిపుణులు
సాక్షి, అమరావతి: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, సీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడుగడుగునా అడ్డుపడుతున్నారనేందుకు మరో నిదర్శనమిది. శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ), తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతికి హక్కుగా దక్కిన కృష్ణా జలాలను వాడుకుని రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సుభిక్షం చేసేందుకు వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను బాబు సర్కారు 19 నెలలుగా పూర్తి స్థాయిలో నిలిపివేయడమే అందుకు తార్కాణం. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులను నిలిపి వేయించా.. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీతో తనిఖీ చేసుకోవచ్చు..’’ అంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. ఒక్క రాయలసీమ ఎత్తిపోతలే కాదు.. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే ఆ నీటిని గరిష్టంగా ఒడిసిపట్టి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులతోపాటు.. రాజోలి, జోలదరాశి, కుందూ ఎత్తిపోతల లాంటి కొత్త ప్రాజెక్టుల పనులను చంద్రబాబు సర్కార్ రాగానే పూర్తి స్థాయిలో నిలిపివేసింది.
ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి 2015లో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు నాయుడు తాకట్టు పెడితే.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 2020లో ఏపీ ప్రయోజనాలను పరిరక్షిస్తూ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ సీపీ హయాంలో చేపట్టిన సీమ ఎత్తిపోతలతోపాటు రాయలసీమ కరువు నివారణ పథకం కింద చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు, కొత్త ప్రాజెక్టుల పనులను ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ నిలిపి వేయడంపై సాగునీటిరంగ నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన శిషు్యడు రేవంత్‌రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చడం కోసం కృష్ణా జలాలపై ఏపీ హక్కులను మళ్లీ తెలంగాణకు తాకట్టు పెట్టడం ద్వారా రాయలసీమను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎడారిగా మార్చేస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు.
సామర్థ్యం పెంచకుండా లైనింగ్ పేరుతో లూటీ..!
కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన కాలువ సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల చేపట్టిన కొత్త ప్రాజెక్టులను పనులను చంద్రబాబు సర్కార్ రాగానే పూర్తిగా నిలిపివేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచే పనులు.. గాలేరు–నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను పూర్తిగా ఆపేసింది. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను కూడా పూర్తిగా ఆపేసింది. ఇక తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి చేపట్టిన కుందూ ఎత్తిపోతల పనులనూ నిలిపివేసింది.
గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పనులకూ చంద్రబాబు సర్కార్ మోకాలడ్డింది. ఇక హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. కానీ.. అధికారంలోకి రాగానే ఆ పనులను ఆపేసిన చంద్రబాబు సర్కార్ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పరిమితం చేస్తూ గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్లుగా చిత్రీకరించి రూ.695.53 కోట్లను దోచేశారని సాగునీటిరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పేరుతో నాసిరకం పనులు చేసి రూ.1,968.62 కోట్లకుపైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
సీమ ఎత్తిపోతలపై ఆది నుంచి బాబు అక్కసు..
⇒ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ సర్కార్ తన అధీనంలోకి తీసుకుంది. కానీ ఏపీ భూభాగంలో ఉన్నప్పటికీ నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను.. పులిచింతల పూర్తిగా ఏపీ ప్రాజెక్టు అయినప్పటికీ అందులో అంతర్భాగమైన విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన అధీనంలోకి తీసుకున్నా నాడు చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఉనికి కోసం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో కిమ్మనడం లేదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
⇒ 2015లో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్‌కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. దీంతో తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాడు చంద్రబాబు కిమ్మనలేదు. ఈ నిర్వాకాల ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సర్కార్ సాధించుకుంది.
⇒ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ–నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం.
⇒ శ్రీశైలం ప్రాజెక్టు దిగువన తాగునీరు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు.. కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయవచ్చు. కానీ.. తెలంగాణ సర్కార్ శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపలేదు. ఏపీ వాటాలో జలాలు మిగిలి ఉన్నప్పటికీ.. శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ఖాళీ చేస్తుండటం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేని దుస్థితి దాపురించింది. దాంతో 2014–19 మధ్య నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు.
⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం... తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి 2020 మే 5న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీమ, నెల్లూరు జిల్లాలకు తాగునీరు, చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది ఈ ఎత్తిపోతల లక్ష్యం. ఈ ప్రాజెక్టు పనులను వైఎస్ జగన్ అధికారంలో ఉండగా పరుగులెత్తించారు. రూ.795 కోట్లకుపైగా విలువైన పనులను పూర్తి చేశారు.
⇒ సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే అక్కసుతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ రైతులతో టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది.
⇒ ఒకవైపు రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నిసూ్తనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్‌లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులకు పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతంగా వాదనలు వినిపించక పోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏకాంత సమావేశంలో కుదిరిన ఒప్పందం వల్లే సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపి వేయించారనడాకి ఇది మరో నిదర్శనమని సాగునీటిరంగ
నిపుణులు స్పష్టం చేస్తున్నారు.



