
ఢిల్లీ : పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భాగంగా భారత సైన్యం సామర్ధ్యాన్ని దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు.. దేశ సైనికుల పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. భారత్‌కు చెందిన రఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని రాహుల్ అడగటం నిజంగా సిగ్గచేటన్నారు. ఈరోజు(శుక్రవారం) ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
‘రాహుల్ అడగాల్సింది.. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి అని కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అని అడిగితే బాగుండు. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి లెక్క చెప్పండి అని.. రాహుల్ రేవంత్ లు అడుగుతున్నారు. రాహుల్ కు 55 ఏళ్లు వచ్చినా, ఇంకా మెచ్యూరిటీ రాలేదు. బడే మియా మాటలకు వత్తాసుగా, చోటే మియా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు. ఇప్పటికే ఎంపీల బృందాలు .. ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుగుతున్నారు. పాక్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియచేస్తున్నారు. రాహుల్, రేవంత్ ల మాటలను దేశ ప్రజలు చూస్తున్నారు. ఢిల్లీలో రేవంత్ మూడు రోజులు ఉన్నా.. రాహుల్ దర్శనం దక్కలేదు.. అవమానానికి గురై వెనక్కి పోయారు. భారత సైనికులను తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గం
దేశ భద్రతకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారు. దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలి. రేవంత్ మన పాకిస్తాన్ అని మాట్లాడారు. రాహుల్ ప్రధాని అయి ఉంటే.. పీఓకేను స్వాధీనం చేసుకుంటారు అని రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ జన్మలో రాహుల్‌కు ప్రధాని అయ్యే అవకాశం రాదు. పాక్ ఎటువంటి దాడులు చేసినా, మోదీ సర్కార్ ఊరుకోలేదు. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాం
కాంగ్రెస్ హయంలో వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. దేశంలో ఎన్నో వరుస పేలుళ్లు జరిగాయి. రాహుల్ దుర్బుద్ధి తో మాట్లాడుతున్నారు. మనదేశం పాక్, చైనాలతో యుద్ధం వచ్చినా.. ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ప్రజలందరూ రాజకీయాలు.. కులాలు.. మతాలు పక్కన పెట్టీ ఒక్కటిగా నిలబడ్డారు
పహల్గామ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలంతా ఆకాక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టాం,. ఆపరేషన్ సింధూర్ ఎవరికి తెలియని సంఘటన కాదు. ప్రతి క్షణం ఎప్పటికప్పుడు అందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్ లో 23 నిమిషాల్లో.. పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. పాక్ ప్రదానితో కూడా ఒప్పుకున్నారు. పాక్ పై చేసిన దాడుల వీడియోలు ప్రపంచం ముందు సైన్యం పెట్టింది’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.