
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్లు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల రిజర్వేషన్ల బాధ్యత తానే తీసుకుంటానని అన్నారాయన. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ..
‘‘రేవంత్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రిని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటారా? రేపు లంబాడాలను కన్వర్టెడ్ ఎస్టీ అంటారా?. అసలు ఆయనే కన్వర్టెడ్ కాంగ్రెస్. మజ్లిస్ కనుసన్నల్లో కాంగ్రెస్ పని చేస్తోంది. ఇదిలాగే కొనసాగితే ఒవైసీ కుటుంబానికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. వచ్చేఎన్నికల్లో రేవంత్ ఓటమి ఖాయం..
.. గతంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను తెలంగాణ హైకోర్ట్ కొట్టేసింది. మజ్లిస్ కనుసైగలతో కేసీఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు 34 శాతం నుంచి 27 శాతం రిజర్వేషన్ తగ్గించారాయన. అలాంటప్పుడు ఇప్పుడెలా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తారు. మత రిజర్వేషన్లతో దేశంలో అల్లకల్లోలం జరుగుతుంది..
.. అసలు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల రిజర్వేషన్ బాధ్యత నేనే తీసుకుంటా. రాష్ట్రపతి, ప్రధానితో కూడా మాట్లాడతా అని కిషన్ రెడ్డి అన్నారు.
.. బీసీలకు వెన్నుపోటు పొడవడంలో తెలంగాణ రోల్ మోడల్. బీసీలను మోసం చేయడంలో, అక్రమాలు చేయడంలో మేము నిరక్షరాస్యులం. కేసీఆర్ వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ సీట్లలో నాన్ బీసీలు మాత్రమే గెలిచారు. కాంగ్రెస్ తెచ్చిన బిల్లుతో బీసీలకు కేవలం 32 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. ఇది బీసీలను మోసం చేయడమే. రాజ్యాంగ సమస్యల వల్లే గవర్నర్ రాష్ట్రపతికి బీసీ బిల్లు పంపారు అని కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘రాష్ట్రపతిపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు సిగ్గు చేటు. దీనిపై సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి’’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారాయన.