
అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్‌చల్ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయగానే వెంట తెచ్చుకున్న తాళాలను దుకాణం నాలుగు షట్టర్లకు వేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేస్తున్న అరాచకం చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.
సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా ఆప్టికల్ షాపు స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ రమణరావు తమకు అన్యాయం చేశారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బొనాల సుమయ వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం దీనిపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్‌లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు... కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి ఇంటికి వెళ్లారు.
దుకాణం వద్ద అరాచకం..
సుమయ దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే 30 మందికి పైగా ‘పచ్చ’ రౌడీలు సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని అరాచకం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ భయోత్పాతం సృష్టించారు. దుకాణంలో పని చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీయగా.. దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ భర్తకు ఫోన్ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే పేరు ఎలా చెబుతావురా.. నా కొడకా’ అంటూ అసభ్యంగా దూషించారు.
శనివారం రాత్రి పలువురు మైనార్టీలతో కలిసి బాధితులు సాయినగర్‌లోని తమ షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్‌లో ఉన్న దుకాణం వద్ద ఇంత అరాచకం సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదన్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తులు తమకు పదులసార్లు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని వాపోయారు.
తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఇదంతా చూస్తుంటే తాము బతికుండి చనిపోయినట్లుగా ఉందన్నారు. దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారే కదా అని బోనాల సుమయ కన్నీళ్లు పెట్టుకున్నారు.
దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి..
బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు సాయినగర్‌కు చేరుకున్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.