జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక
ధర్మవరం: ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి హాకీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అండర్ – 14 విభాగం ఏపీ జట్టులో ధర్మవరానికి చెందిన విద్యార్థిని శ్రీలేఖ చోటు దక్కించుకుంది. ఈ మేరకు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్ తెలిపారు.
నేత్రదానం
ముదిగుబ్బ: మరణానంతరం తన నేత్రాలను దానం చేయడం ద్వారా మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించారు ముదిగుబ్బకు చెందిన రంగయ్యశెట్టి. మంగళవారం ఆయన మృతిచెందారు. తన మరణానంతరం కళ్లను దానం చేయాలని తాను బతికున్నప్పుడు కుటుంబ సభ్యులను ఆయన కోరారు. ఆయన కోరిక మేరకు నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు.
రైల్వేస్టేషన్‌లో
గుర్తు తెలియని మృతదేహం
ధర్మవరం: స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్‌లోని పార్సిల్ కార్యాలయం సమీపంలో దాదాపు 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. ఆచూకీ తెలిసిన వారు 89786 56463, 99513 25345 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.
ధర్మవరం చెరువులో ..
ధర్మవరం అర్బన్: స్థానిక చెరువు ఒకటవ మరువ వద్ద మంగళవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉంటుందని, వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 94407 96831కు సంప్రదించాలని సీఐ నాగేంద్రప్రసాద్ కోరారు.
మృతురాలి ఆచూకీ లభ్యం
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం సమీపం లోని హంద్రీ–నీవా కాలువలో సోమవారం లభ్యమైన మృతదేహం ఆచూకీని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను మంగళవారం వెల్లడించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న జానకంపల్లికి చెందిన నంజమ్మ (80) గత 15 రోజులుగా కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో సోమవారం హంద్రీ–నీవా కాలువలో మృతదేహాన్ని వెలికి తీసిన విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు మృతురాలిని నంజమ్మగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
హత్యా? ఆత్మహత్యా?
పావగడ: స్థానిక మార్కెట్ యార్డు చివర నిర్జన ప్రదేశంలో లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆచూకీ లభ్యమైంది. వేలికి ఉన్న ఉంగరం ఆధారంగా మృతుడిని బేకరి నిర్వాహకుడు రఘు (39)గా కుటుంబసభ్యులు గుర్తించారు. విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా చంపి మృతదేహాన్ని అక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రఘు కొంత కాలంగా లారీ డ్రైవర్‌గానూ వెళుతున్నాడు. వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రఘు ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. తాలూకాలోని కేటీ హళ్లిలో ఉంటున్న చిన్నమ్మ ఇంటికి వెళ్లాడనుకుని భార్య ఉషారాణి ఆరా తీసింది. అయితే అక్కడ కూడా లేడని తెలుసుకున్న ఆమె తీవ్ర ఆందోళనకు లోనైంది. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల క్రితం ఉషారాణికి చిత్రదుర్గం నుంచి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి రఘు లారీ డ్రైవర్‌గా వెళ్లాడని తెలిపాడు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా ఆ వ్యక్తి ఫోన్ చేసి అదే విషయాన్ని తెలిపాడు. ఈ సంభాషణ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించనున్నట్లు సమాచారం.
జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక
జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక


